పౌరసత్వ సవరణ బిల్లుకు టీఆర్‌ఎస్ వ్యతిరేకం - MicTv.in - Telugu News
mictv telugu

పౌరసత్వ సవరణ బిల్లుకు టీఆర్‌ఎస్ వ్యతిరేకం

December 9, 2019

Amit Shah

కేంద్ర హోం మంత్రి అమిత్‌షా పౌరసత్వ సవరణ బిల్లు-2019ను ఈరోజు లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ, ఈ బిల్లు ఏ ఒక్క వర్గానికీ వ్యతిరేకం కాదని అన్నారు. దేశంలోని మైనార్టీలకు 0.001 శాతం కూడా ఈ బిల్లు వ్యతిరేకం కాదని తెలిపారు. బిల్లుకు సంబంధించి సభ్యులు అడిగే అన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పేందుకు తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. సభ నుంచి ఏ పార్టీ కూడా వాకౌట్ చేయవద్దని కోరారు.

మంగళవారం నాటికే రెండు సభల్లో బిల్లు ఆమోదం పొందేలా మోదీ సర్కార్‌ కసరత్తులు చేస్తోంది. ఈ క్రమంలో బీజేపీ ఎంపీలంతా తప్పనిసరిగా హాజరు కావాలంటూ ఇప్పటీకే పార్టీ విప్‌ జారీ చేసింది. ఎన్డీఏ మిత్ర పక్షాలతో పాటు మరికొన్ని పార్టీలు తమకు మద్దతు తెలుపుతాయని బీజేపీ ధీమా వ్యక్తం చేస్తోంది. ఈ బిల్లును వ్యతిరేకించాలంటూ తమ ఎంపీలకు టీఆర్ఎస్ పార్టీ విప్ జారీ చేసింది. ఈశాన్య రాష్ట్రాలలో అధికసంఖ్యలో ప్రజలు, ప్రజా సంఘాలు ఈ బిల్లును వ్యతిరేకిస్తుండటంతో తీవ్ర స్థాయిలో నిరసనలు చెలరేగిన విషయం తెలిసిందే. 1985 నాటి అసోం ఒప్పందంలో పేర్కొన్న నియమ నిబంధనలను ఈ బిల్లు కాలరాస్తోందని వ్యతిరేకులు విమర్శిస్తున్నారు. ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఈశాన్య ప్రాంత విద్యార్థి సంఘం ఈ నెల 10న 11 గంటల బంద్‌కు పిలుపునిచ్చింది. వివక్షాపూరితంగా ఉన్న బిల్లును తాము వ్యతిరేకిస్తామని కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ ప్రకటించిన విషయం తెలిసిందే.