సూపర్‌స్టార్‌ కృష్ణ మృతికి సంతాపం తెలిపిన లోక్‌సభ - MicTv.in - Telugu News
mictv telugu

సూపర్‌స్టార్‌ కృష్ణ మృతికి సంతాపం తెలిపిన లోక్‌సభ

December 7, 2022

 

 

మాజీ ఎంపీ , సూపర్‌స్టార్ కృష్ణకు పార్లమెంట్‌ ఘననివాళి అర్పించింది. నటుడిగా, పార్లమెంట్‌ సభ్యుడిగా కృష్ణ ఎన్నో దశాబ్దాల పాటు ప్రజా సేవ చేశారని కొనియాడారు లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లా. తెలుగు సినిమారంగంలో ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. కృష్ణ మృతికి సంతాప సూచికంగా లోక్‌సభ రెండు నిముషాల పాటు మౌనం పాటించింది. సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయంసింగ్‌ యాదవ్‌కు కూడా సభ ఘన నివాళి అర్పించింది. కాగా పార్లమెంటు శీతాకాల సమావేశాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. సమావేశాలకు ముందు మీడియాతో మాట్లాడిన మోదీ.. చర్చలు ఫలప్రదంగా జరిగేందుకు ప్రతిపక్షాలు సహకరించాలని కోరారు. ఈ సమావేశాల్లో కొత్తగా సభకు ఎన్నికైన వారు, యువకులకు చర్చల్లో పాల్గొనేందుకు అవకాశమివ్వాలని అన్ని పార్టీలకు సూచించారు.

ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన తరువాత తొలిసారి రాజ్యసభ చైర్మన్గా సభా కార్యకలాపాలు చేపట్టారు జగదీప్ దన్ఖడ్. ఈ నేపథ్యంలో ఉపరాష్ట్రపతి గౌరవార్థం.. రాజ్యసభలో సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సారి పార్లమెంటు సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ప్రతిపక్షాలు సిద్ధమయ్యాయి. నిరుద్యోగం, సరిహద్దు వివాదం, ధరల పెరుగుదల లాంటి విషయాలపై ప్రతిపక్షాలు ప్రశ్నలు సంధించనున్నాయి. మరోవైపు ప్రభుత్వం 16 బిల్లులను ప్రవేశపెట్టడానికి సిద్ధం అవుతోంది.