బిల్లు పాస్.. దేశంలో కొత్తగా ఐదు ఐఐఐటీలు - MicTv.in - Telugu News
mictv telugu

బిల్లు పాస్.. దేశంలో కొత్తగా ఐదు ఐఐఐటీలు

September 22, 2020

Parliament passes IIIT amendment bill

ఇండియన్ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ(ఐఐఐటీ) సవరణ బిల్లును ఈరోజు రాజ్యసభ ఆమోదించింది. భారతీయ విద్యా సంస్థలను ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని రాజ్యసభలో బిల్లు ప్రవేశపెడుతున్న సమయంలో విద్యాశాఖ మంత్రి రమేష్ పొక్రియాల్ తెలిపారు. దీంతో దేశంలో పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్యంతో కొత్తగా అయిదు ఐఐఐటీల స్థాపన జరుగనుంది. భోపాల్‌, భగల్‌పూర్‌, సూరత్‌, రాయ్‌చూర్‌, అగర్తలలో ఈ ఐఐఐటీలను ఏర్పాటు చేయనున్నారు. ఈ బిల్లుపై పలువురు ఎంపీలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. 

బీజేపీ ఎంపీ కామ్యఖా ప్రసాద్ మాట్లాడుతూ.. ప్రపంచంలో రోజురోజుకి ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీకి ప్రాధాన్యత పెరుగుతుందని తెలిపారు. అన్నాడీఎంకే ఎంపీ విజయ్‌కుమార్ మాట్లాడుతూ.. బిల్లుతో ఐఐఐటీల గ్లోబల్ ర్యాంకింగ్స్ పెరుగుతాయన్నారు. డిగ్రీలను అందజేసే అధికారాలను ఐఐఐటీలకు ఇవ్వడం హర్షణీయమని బీజేడీ ఎంపీ సస్‌మిత్ పాత్ర తెలిపారు. భువనేశ్వర్‌లో ఐఐఐటీ ఏర్పాటు చేయాలని కోరారు. ఇతర విద్యా సంస్థలకు జాతీయ ప్రాముఖ్యత కల్పించే విధంగా ప్రభుత్వం కృషి చేయాలని, ఐఐఐటీల్లో కోర్సులను స్థిరీకరించాలని, అవి ఐఐటీలతో సమానంగా మారనున్నట్లు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు.