పార్లమెంటులో జుమ్లా, అవినీతిపరుడు, మోసం, హిపోక్రసీ, నియంత వంటి కొన్ని పదాల వాడకుండా తెచ్చిన నిషేధంపై వివాదమింకా సమసిపోకముందే మరో నిషేధం అమల్లోకి వచ్చింది. పార్లమెంటు పరిసరాల్లో అన్ని రకాల నిరసనలను నిషేధిస్తూ రాజ్యసభ ఉత్తర్వులు జారీ చేసింది. నిరసనలు, నిరాహార దీక్షలు, ధర్నాలు, మత కార్యక్రమాలు దేశ చట్ట సభ దగ్గర చోటు లేదని పెద్ద సభ సర్క్యలర్లో చెప్పుకొచ్చింది. వర్షకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ ఆంక్షలు విధించడం గమనార్హం. సభ్యులందరూ ఈ నిషేధానికి కట్టుబడి ఉండాలని రాజ్యసభ సెక్రటరీ జనరల్ పీసీ మోదీ కోరారు. నిషేధంపై విపక్షాలు మండిపడుతున్నాయి. మోదీ ప్రభుత్వం దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తోందని, పార్లమెంటులోనూ సభ్యుల హక్కులకు భంగం కలిగిస్తోందని కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు.