రాహుల్ గాంధీ సారీ చెప్పాల్సిందే..మహిళా ఎంపీలు - MicTv.in - Telugu News
mictv telugu

రాహుల్ గాంధీ సారీ చెప్పాల్సిందే..మహిళా ఎంపీలు

December 13, 2019

Rahul gandhi02

దేశంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలపై రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలపై పార్లమెంట్‌లో దుమారం రేగింది. ఈ వ్యాఖ్యలపై లోక్‌సభలో బీజేపీ మహిళా ఎంపీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రాహుల్‌ సభలో క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్‌ చేశారు.

కేంద్రమంత్రి స్మృతి ఇరానీ మాట్లాడుతూ..’మేకిన్‌ ఇండియాను అత్యాచారాలతో పోల్చుతూ “రేప్ ఇన్ ఇండియా” అని గాంధీ కుటుంబం నుంచి వచ్చిన ఓ రాజకీయ నేత వ్యాఖ్యలు చేయడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి. ఇదేనా రాహుల్‌ దేశ ప్రజలకు ఇచ్చే సందేశం?’ అని ఆమె మండిపడ్డారు. ఆయనకు తగిన శిక్ష విధించాలని డిమాండ్‌ చేశారు. ఇతర పార్టీలకు చెందిన మహిళా ఎంపీలు కూడా రాహుల్‌ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో స్పీకర్ ఓం బిర్లా సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. 

అటు రాజ్యసభలోనూ ఇదే విషయంపై గందరగోళం నెలకొంది. ‘రాహుల్‌ గాంధీ క్షమాపణ చెప్పాలి’ అంటూ కొందరు ఎంపీలు డిమాండ్ చేశారు. దీంతో ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు స్పందిస్తూ..’సభలో లేని వ్యక్తి పేరును చెప్పడం సరికాదు. సభకు ఆటంకం కలిగించొద్దు’ అని ఎంపీలకు సూచించారు. అయినప్పటికీ సభ్యులు ఆందోళన చేయడంతో సభను మధ్యాహ్నానికి వాయిదా వేశారు. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన రాహుల్ గాంధీ ప్రసంగిస్తూ..’మోదీ మేక్ ఇన్ ఇండియా అని చెప్పారు. కానీ, ఇక్కడ రేప్ ఇన్ ఇండియా జరుగుతోంది. ఎక్కడ చూసినా మహిళలు అత్యాచారానికి గురవుతున్నారు’ అని పేర్కొన్నారు.