భారతదేశంలో ఇవాళ్టి నుంచి ఆగస్టు 12వ తేదీ వరకు వర్షాకాల పార్లమెంటు సమావేశాలు ప్రారంభకానున్నాయి. ఈ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం మొత్తం 24 బిల్లులను ప్రవేశపెట్టేందుకు సిద్దమైంది. మరోవైపు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నిక కూడా ఈ సమావేశాల్లోనే నిర్వహించనున్నారు. అంతేకాదు, ఈ సమావేశాల తొలిరోజే రాష్ట్రపతి ఎన్నికల్లో ఎంపీలు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు.
ఈ క్రమంలో ప్రతిపక్షాలు..ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, అగ్నిపథ్ పథకం, చమురు, గ్యాస్ ధరలు, రూపాయి విలువ పతనం, సరిహద్దుల్లో చైనాతో పెరిగిన ఉద్రిక్తతలు వంటి అంశాలను లేవనెత్తడానికి రెడీ అయ్యాయి. అయినా, ప్రతిపక్షాలు సహకరించినా, సహకరించకపోయినా రోజుకు రెండు బిల్లులను ప్రవేశపెట్టేందుకు మోదీ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
మరోవైపు పార్లమెంటు సమావేశాలు ప్రారంభంకానున్న సందర్భంగా కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి 45 రాజకీయ పార్టీలను ఆహ్వానించగా, అందులో 36 పార్టీల ప్రతినిధులు హాజరయ్యారు. ”ఉభయ సభల్లో 32 బిల్లులు ప్రవేశపెట్టేందుకు వివిధ విభాగాలు సూచించాయి. వాటిలో 14 బిల్లులు సిద్ధంగా ఉన్నాయి. ఈ సమావేశాల్లో మొత్తం 24 బిల్లులను ప్రవేశపెడతాం” అని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు.