గోవా ముఖ్యమంత్రి, మాజీ రక్షణ మంత్రి మనోహర్ పరీకర్ పణజీ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి గిరీశ్ చోడంకర్ పై 4,803 ఓట్ల మెజారిటీతో ఆయన గెలిచినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. సోమవారం ఓట్లను లెక్కించారు. ఈ ఏడాది మొదట్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచిన బీజేపీ చిన్నాచితకా పార్టీలతో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, పరీకర్ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసి సీఎం కావడం తెలిసిందే.
ఎన్నికల్లో గెలుపుపై పరీకర్ ఇటీవల అనుమానం వ్యక్తం చేశారు. తాను ఓడిపోయినా తనకొచ్చిన నష్టమేమీ లేదని, రక్షణ మంత్రి పదవి తన కోసం కాసుక్కూర్చుని ఉందని చెప్పారు. ఈ నెల 23న పణజితోపాటు ఢిల్లీలోని బవానా, నంద్యాల తదిత అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరిగాయి.