రక్షణ మంత్రి పదవంటే అంత చులకనా పరీకర్..! - MicTv.in - Telugu News
mictv telugu

రక్షణ మంత్రి పదవంటే అంత చులకనా పరీకర్..!

August 18, 2017

నిజాయతీపరుడని, వివాదాల జోలికి పోడని భావించే గోవా ముఖ్యమంత్రి మనోహర్ పరీకర్ లో ఈ మధ్య మార్పు వచ్చింది. రాజకీయాల్లో మనుగడ సాగించాలంటే నిత్యం జనం నోళ్లలో నానుతూ ఉండాలని అనుకున్నారేమో ఈ మధ్య ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు జోరుగానే చేస్తున్నారు.

రక్షణ మంత్రి పదవికి రాజీనామా చేసి, గోవా పీఠం ఎక్కిన పరీకర్ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికవాల్సి ఉంది. ‘అసెంబ్లీ ఎన్నికల్లోనేను ఓడిపోయినా నాకేం ఢోకా లేదు. రక్షణ మంత్రి పదవి నాకోసం కాసుక్కూర్చుని ఎదురుచూస్తోంది’ అని పరీకర్ ఇటీవల చెప్పుకొచ్చారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.

‘పరీకర్.. రక్షణ మంత్రి పదవంటే నీకు అంత చులకనా? ఓ ముఖ్యమంత్రి చేయాల్సిన వాఖ్యలేనా ఇవి? దేశ అత్యున్నత పదవిని ఇంత ఘోరంగా అవమానిస్తావా.. ’’ అని బీజేపీ మిత్రపక్షం శివసేనే ఎండగట్టింది. గతంలో దేశ సరిహద్దు ఉద్రిక్తంగా ఉన్నప్పుడు పరీకర్ గోవా వెళ్లి చేపల కూర వండుకుని తిన్న విషయాన్నీ ప్రస్తావించింది.

గోవా సీఎం అయ్యాక కూడా రాజ్యసభ సభ్యత్వాన్ని అంటిపెట్టుకునే ఉన్న పరీకర్ ఇప్పటికే ఆ విషయంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. జోడు పదవుల అధికార దాహాన్ని వ్యతిరేకించే బీజేపీ నేతలు ఇంత అన్యాయంగా ప్రవర్తించడమేమిటని కాంగ్రెస్ వంటి విపక్షాలే కాకుండా ఎన్డీయేలోని కొన్ని మిత్రపక్షాలూ విరుచుకుపడ్డాయి. ‘ఒక వ్యాపారవేత్త పరిశ్రమను స్థాపించాలంటే అనుమతి కోసం 16 మంది వద్ద తనిఖీలు పూర్తి చేసుకోవాలి. అయితే ఒక రేప్ బాధితురాలిని మాత్రం కేవలం ఒక ఇన్స్పెక్టర్ విచారిస్తే సరిపోతుంది’ అని పరీకర్ గతంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.