పోలీసుల వద్దకు ఓ విచిత్ర సమస్య వచ్చింది. ఒక రామచిలుక కోసం ఇద్దరు యజమానుల మధ్య నెలకొన్న వివాదాన్ని ఎలా పరిష్కరించాలో తెలియక తలలు పట్టుకున్నారు. చివరికి వారికి ఊరటనిస్తూ ఆ చిలకే తన వల్ల ఏర్పడిన సమస్యను పరిష్కరించింది. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ కాగా, నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఉత్తరప్రదేశ్ లోని శంకర్ గఢ్ లో చోటుచేసుకున్న ఈ ఘటన గురించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బడీవార్ ప్రాంతానికి చెందిన బూటీ అనే యువతి పెంచుకున్న చిలుక రెండేళ్ల కింద కనపడకుండా పోయింది.
అయితే ఆదివారం ఓ మహిళ వద్ద తన చిలుకను చూసిన బూటీ అది తనదేనని తిరిగిచ్చేయాలని కోరింది. మహిళ నిరాకరించడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం రేగి గొడవకు దారి తీసింది. ఈ క్రమంలో పోలీసులకు బూటీ ఫోన్ చేయగా, శంకర్ గఢ్ పోలీసులు వచ్చి చిలుకతో పాటు ఇద్దరినీ స్టేషనుకి తరలించారు. అక్కడ ఎవరి వాదనలు వారు వినిపించడంతో పోలీసులకు ఇది తలనొప్పిగా మారింది. అయితే ఫిర్యాదు చేసిన బూటీ చెప్పిన మాటలతో వారికి ఓ క్లూ దొరికినట్టైంది. తాను పెంచుకున్న చిలుక అయి ఉంటే తన పేరు చెప్తుందని చెప్పగా, యజమానిని నిర్ణయించేందుకు ఇదే సరైందని భావించి చిలుకకు పరీక్ష పెట్టారు. చిలుక ఆ యువతి పేరు పిలిస్తే తనకు అప్పగిస్తామని లేదంటే మహిళకు ఇస్తామని స్పష్టంగా చెప్పారు. దీంతో యువతి ప్రేమగా పలకరించగా, అది కూడా బూటీ అనడంతో యువతిని యజమానిగా నిర్ధారించి చిలుకను ఇచ్చి పంపించేశారు.
ఇవి కూడా చదవండి
వచ్చే ఏడాది 13 నెలలు.. అదనంగా వస్తున్న ఓ మాసం