బూతు చిలకలు.. భరించలేక దాచిపెట్టేశారు!  - MicTv.in - Telugu News
mictv telugu

బూతు చిలకలు.. భరించలేక దాచిపెట్టేశారు! 

September 29, 2020

Parrots bad words of their mouths

ముద్దుముద్దుగా మాట్లాడే చిలుక పలుకులు వినాలని అనుకుంటాం. మనం ఏం అంటే అవి కూడా అవే మాటలను ఎంతో ముద్దుగా అప్పజెప్పడం ఆశ్చర్యంగా అనిపిస్తుంటుంది. అయితే ఈ చిలుకల మాటలు వింటే వామ్మో అంటారు. ఇవేం మాటలమ్మా అని పారిపోవడం ఖాయం. మనుషులు బూతులు మాట్లాడితేనే చెవులు మూసుకుంటాం.. అలాంటిది చిలుకలు బూతులు మాట్లాడుతుంటే వినగలమా? ఇవెక్కడి రౌడీ చిలుకలు.. అంతలా బూతులు మాట్లాడుతున్నాయి అని చాలామంది వాటి మాటలు విని షాక్ అవుతున్నారట. లండన్‌లోని లింకన్ షైర్ జంతు ప్రదర్శన శాలలో ఈ బూతు చిలుకలు ఉన్నాయి. అక్కడికి వచ్చిన సందర్శకులను పట్టుకుని నోటికొచ్చినట్టు పచ్చి బూతులు తిట్టేస్తున్నాయట. ఆ మాటలు విని ఏంటి చిలకలే ఇలా మాట్లాడుతున్నాయి అని ఆశ్చర్యపోతున్నారట? ఇంక అవి వినకుండా బూతుల దండకం చదువుతుంటే వినడం భరించలేక చెవులు మూసుకుని పలాయనం చిత్తగిస్తున్నారట. 

ఈ ఏడాది ఆగస్టు 15న ఆ పార్కుకి ఐదు ఆఫ్రికన్ చిలుకలను తీసుకొచ్చారు. వాటన్నింటినీ ఒక గదిలో ఉంచారు. అయితే అవి ఎలా బూతులు మాట్లాడటం నేర్చుకున్నాయో తెలీదు గానీ.. సందర్శకులను అమ్మనా బూతులు తిట్టేస్తున్నాయి. అక్కడున్న జూ కీపర్లు, ఇతర సిబ్బందిని కూడా వదిలిపెట్టకుండా తిట్టి పోస్తున్నాయి.  అయితే అవి తమను ఎంత తిట్టినా హాయిగా ఉందని కొందరు వాటి బూతులు విని తరిస్తున్నారట. వాటిని డిస్ ప్లేలోకి మార్చగా.. పార్కుకు వచ్చిన సందర్శకులను మూకుమ్మడిగా బూతులు తిట్టడం మొదలుపెట్టాయి. కొందరు వాటి మాటలు వినలేక జూ అధికారులకు ఫిర్యాదు చేశారు. వెంటనే ఆ చిలుకలను డిస్ ప్లే నుంచి తొలగించారు. ఈ విషయమై పార్క్ సీఈఓ స్టీవ్ నికోలస్ మాట్లాడుతూ.. ‘వాటిలో ఒక చిలుకకు బూతులు వచ్చి ఉంటాయి. అన్నింటినీ కలిపి ఉంచడం వల్లే ఒకదాని నుంచి ఒకటి బూతు పదాలు నేర్చుకుని ఉంటాయి. మరోసారి ఇలాంటి పొరపాటు జరగకుండా చర్యలు తీసుకుంటాం’ అని నికోలస్ వెల్లడించారు.