ప్రజల్లో నా ఇమేజ్‌పై ఆందోళనగా ఉంది.. దయచేసి బెయిల్ ఇవ్వండి
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వెస్ట్ బెంగాల్ టీచర్ల కుంభకోణం స్కాంలో ప్రధాన నిందితులు మాజీ మంత్రి పార్థ చటర్జీ, ఆయన సన్నిహితురాలు అర్పితా ముఖర్జీ బుధవారం కోర్టు ముందు వర్చువల్‌గా హాజరయ్యారు. ఈడీ విచారణ అనంతరం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న వీరిద్దరినీ కోర్టు విచారించింది. ముందుగా పార్థ చటర్జీని విచారించగా, కోర్టు ముందు ఆయన తన గోడు వెళ్లబోసుకున్నారు. ‘నేను ఎకనామిక్ స్టూడెంట్‌ని. ఎల్ఎల్బీ చదివా. బ్రిటిష్ స్కాలర్‌షిప్ కూడా పొందాను. నా కూతురు యూకేలో నివసిస్తోంది.
మంత్రి కావడానికి ముందు ప్రతిపక్షనేతగా ఉన్నా. అలాంటిది నేనెందుకు స్కాంలో పాలుపంచుకుంటాను. రాజకీయాలకు నన్ను బలిపశువును చేశారు. ఈడీ అధికారులను నా ఇంటిని, నియోజకవర్గానికి వెళ్లమనండి. నేనేంటో తెలుస్తుంది. ప్రజల్లో నా ఇమేజ్ గురించి ఆందోళనగా ఉంది. విచారణకు పూర్తిగా సహకరిస్తున్నాను. ఎలాంటి షరతులతో అయినా బెయిల్ ఇవ్వండి. తదుపరి జీవితం ప్రశాంతంగా బ్రతకాలనుకుంటున్నా’నని ప్రాధేయపడ్డారు. తర్వాత అర్పితా ముఖర్జీని డబ్బు ఎక్కడ దొరికిందో తెలుసా? అని ప్రశ్నించగా, తెలుసు నా ఇంట్లో అని సమాధానమిచ్చింది. అయితే ఆ డబ్బు తన ఇంటికి ఎలా వచ్చిందో తెలియదని వాపోయింది. తమది మధ్య తరగతి కుటుంబమని, 82 ఏళ్ల తల్లి అనారోగ్యంతో భాధపడుతోందని కన్నీరు కార్చింది. తర్వాత తనలాంటి వాళ్ల ఇళ్ల మీద ఈడీ దాడులు ఎలా చేస్తుందని ఎదురు ప్రశ్నించింది. దానికి కోర్టు.. అవసరమైతే దేశంలో ఎవరి ఇంట్లోనైనా తనిఖీ చేసే అధికారం ఈడీకి ఉందని స్పష్టం చేసింది. కాగా, అర్పిత ఇంట్లో రూ. 50 కోట్ల నగదు దొరకడం తెలిసిందే. దీంతో మంత్రి పార్థ చటర్జీని మంత్రి పదవితో పాటు పార్టీ బాధ్యతల నుంచి కూడా తప్పించింది టీఎంసీ పార్టీ.