Paruchuri Gopalakrishna gave key suggestions to Pawan Kalyan
mictv telugu

పవన్ కల్యాణ్ ఈ పని చేస్తే కచ్చితంగా ఓట్లు పడతాయి – పరుచూరి

September 6, 2022

జనసేన అధ్యక్షుడు, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌పై ప్రముఖ సినీ రచయిత పరుచూరి గోపాల కృష్ణ కీలక వ్యాఖ్యలు చేశారు. తన యూట్యూబ్ ఛానెల్‌లో పవన్ గురించి మాట్లాడారు. ఆయన మాటల్లోనే.. ‘పవన్ కల్యాణ్ సినీ కెరీర్‌లో ఓ దశలో అద్భుతంగా వెళ్లాడు. తర్వాత రూటు మార్చి డిఫరెంట్ స్టైల్లో ట్రై చేశాడు. మళ్లీ అత్తారింటికి దారేదితో జనాలను అయోమయానికి గురి చేశాడు. ఇప్పుడు మళ్లీ డిఫరెంట్ సబ్జెక్ట్ ఎంచుకున్నాడు. సినిమా వేరు, రాజకీయం వేరు. ఏదో ఎమ్మెల్యే, ఎంపీగా ఓ సారి ప్రయత్నిద్దామనుకుంటే అది వేరు. కానీ, సమాజాన్ని తన దృక్పథంలో మార్చాలనే ఆశయం ఉండడం వేరు. పవన్‌లో ఇది స్పష్టంగా కనిపిస్తోంది. గతంలో ఎన్టీఆర్ కూడా ఇలానే ఉండేవారు. వీరిద్దరూ ఓ ఆశయం కోసం పనిచేయాలనే తపన ఉన్నవాళ్లు. పవన్ వాయిస్ చట్టసభల్లో వినిపించాలని బలంగా కోరుకునే వ్యక్తుల్లో నేను ఒకరిని. ఆ అవకాశాన్ని వచ్చే ఎన్నికల్లో ఆయన పొందాలి. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రాకముందు బొబ్బిలిపులి, జస్టిస్ చౌదరి వంటి సినిమాలు చేశారు. అవి ఎంతగానో ఉపయోగపడ్డాయి. ఇప్పుడు పవన్ కూడా అలాంటి సినిమాలు చేసి ప్రజల్లోకి వెళ్లే విధంగా చూసుకోవాలి. ప్రజలకు కొన్ని ఆశలు, ఆశయాలు ఉంటాయి. వాటిని నెరవేర్చే వారికోసం వారు ఎదురు చూస్తుంటారు. పవన్ ఆ ఛాయిస్ తీసుకోవాలని ఆశీర్వదిస్తున్నా’నని అభిప్రాయపడ్డారు.