డబ్బు పవర్ : పదివేలు అప్పు దొరక్క కుటుంబం ఆత్మహత్య - MicTv.in - Telugu News
mictv telugu

డబ్బు పవర్ : పదివేలు అప్పు దొరక్క కుటుంబం ఆత్మహత్య

June 1, 2022

సమయానికి చిన్న మొత్తంలో డబ్బు సర్దుబాటు కాక ఓ కుటుంబంలోని నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. అందులో ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. డబ్బుకున్న పవర్ తెలియజేసేలా ఉన్న ఈ సంఘటన హైదరాబాదులో జరిగింది. పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మాదన్న పేటలో మహ్మద్ పాషా, భార్య ఫాతిమా బేగం, పిల్లలు ఫిర్డోస్ బేగం, నెహత్ బేగంలు నివసిస్తున్నారు. పాషా వెల్డింగ్ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో కుటుంబానికి ఆర్దిక సమస్యలు రావడంతో పాషా ఓ వ్యక్తి వద్ద వడ్డీకి రూ. పదివేలు అప్పు చేశాడు. కొంతకాలం తర్వాత ఇచ్చిన అప్పు తిరిగి చెల్లించాలని వ్యక్తి బెదిరింపులకు దిగడంతో పాషా ఒత్తిడికి గురయ్యాడు. దాంతో అప్పును తీర్చేందుకు తన మామ, బావ మరిది, తండ్రిలను పదివేలు అడిగాడు. బావమరిది, మామలు తమ వద్ద డబ్బులు లేవని చెప్పగా, తండ్రి మాత్రం ఒకరోజు సమయం అడిగాడు. ఆ ఒకరోజు కూడా ఓపిక పట్టలేని పాషా తన భార్యాపిల్లలను తీసుకొని బాలాపూర్ మండలం కుర్మల్ గూడ చెరువు వద్దకు చేరుకున్నాడు. మొదట పిల్లలిద్దరికీ విషమిచ్చి చెరువులోకి తోసేశాడు. తర్వాత భార్యతో కలిసి తానూ విషం తాగి ఇద్దరూ దూకేశారు. తెల్లారి ఉదయం చెరువులో శవాలు తేలియాడగా, పోలీసులు ఎంటరయి శవాలను తీసి పాషా బంధువులకు సమాచారం ఇచ్చారు. వెంటనే పాషా బావమరిది సంఘటనా స్థలానికి చేరుకొని గుండెలవిసేలా రోదించాడు. ఒక్క పదివేలు ఉంటే నా అక్క కుటుంబం బతికేదని విలపించాడు. అనంతరం పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.