కరోనా ఎఫెక్ట్.. రైలు ప్రయాణాలపై ఆసక్తి చూపని జనం - MicTv.in - Telugu News
mictv telugu

కరోనా ఎఫెక్ట్.. రైలు ప్రయాణాలపై ఆసక్తి చూపని జనం

June 5, 2020

Passengers Dislike Journey in Train

దేశవ్యాప్తంగా 200 ప్రత్యేక రైళ్లను నడిపేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. లాక్‌డౌన్ 5  అమలు చేస్తూ.. ఈ నెల 1 నుంచి సర్వీసులు తిరిగి ప్రారంభమయ్యాయి. అన్ని ప్రత్యేక చర్యలు తీసుకున్న తర్వాతే ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చుతున్నారు. అయినా కూడా చాలా మంది రైలు ప్రయాణాలకు ఆసక్తి చూపడం లేదు. తాజాగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరిన రైళ్లలో ప్రయాణికుల వివరాలే ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయి. లాక్‌డౌన్‌కు ముందు కిక్కిరిసి ప్రయాణించిన జనం ఇప్పుడు వాటిపై పెద్దగా ఆసక్తి చూపడం లేదని తేలింది. 

రైల్వే చార్ట్ ప్రకారం సికింద్రాబాద్ స్టేషన్ నుంచి బయలుదేరిన రైళ్లలో ప్రయాణికుల వివరాలు వెల్లడించారు. గురువారం  గోదావరి ఎక్స్‌ప్రెస్‌లో 1,516 మంది ప్రయాణించాల్సి ఉండగా 1,276 మంది మాత్రమే బుకింగ్ చేసుకున్నారు. ఇక నిజామాబాద్ నుంచి సికింద్రాబాద్ మీదుగా తిరుపతి వెళ్లాల్సిన రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌లో 620 మందికి అవకాశం ఉండగా 421 మంది ఎక్కారు. హౌరా వెళ్లే ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌లో 1,493 మందికి గాను 1,400 మంది ప్రయాణం చేశారు. ఈ లెక్కలను బట్టి అత్యవసరం అయితే తప్ప ప్రయాణాలు చేయడం లేదని వెల్లడి అవుతోంది.