ప్రయాణికుల్లారా..నేడు మెట్రో సేవలు యథాతథం..
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో నేడు మెట్రో సేవలు యథావిధిగా నడుస్తాయని అధికారులు తెలిపారు. గతకొన్ని రెండు రోజులుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భద్రత కారణంగా రెండు రోజులపాటు హైదరాబాద్‌లో మెట్రో రైలు సేవలు అందుబాటులో ఉండవని సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న వార్తలను ప్రయాణికులు నమ్మవద్దని, అవన్నీ వాస్తవాలు కావని మెట్రో అధికారులు కోరారు.
మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి మెట్రో సేవలకు సంబంధించి ఓ ప్రకటన విడుదల చేశారు. ఆ ప్రకటనలో.. "ప్రధానమంత్రి నరేంద్రమోదీ భద్రత కారణంగా రెండు రోజులపాటు మెట్రో రైలు సేవలు అందుబాటులో ఉండవని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు పూర్తిగా అబద్దం. అవన్నీ తప్పుడు వార్తలు. అందులో ఏమాత్రం నిజం లేదు. నేడు యథాతథంగా రైళ్లు నడుస్తాయి. ఆదివారం సాయంత్రం పరేడ్ గ్రౌండ్స్‌లో బీజేపీ విజయ్ సంకల్ప్ సభ జరగనుంది. దీంతో మధ్యాహ్నం రెండు గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మెట్రో సేవలు మాత్రం నిలిపివేయబడవు. ప్రయాణికులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలని కోరుతున్నాము" అని పేర్కొన్నారు.
మరోపక్క తెలంగాణ బీజేపీ నాయకులు నేడు సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్‌లో బీజేపీ బహిరంగ సభ ఏర్పాట్లను పూర్తి చేశారు. ఈ సభకు ప్రధాని మోదీతోపాటు కేంద్ర మంత్రులు, బీజేపీ జాతీయ స్థాయి నేతలు హాజరుకానున్నారు. అయితే, సభ దృష్ట్యా సాయంత్రం 5.30 నుంచి రాత్రి 8 గంటల వరకు మాత్రమే మెట్రో సేవలను పోలీసుల అధికారుల సూచనల మేరకు మూడు స్టేషన్లలో రైల్వే సేవలను నిలిపివేస్తున్నట్లు సంస్థ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు. ఎంజీబీఎస్-జేబీఎస్ రూట్‌లతోపాటు ఉప్పల్-మియాపూర్ రూట్‌ల్లో రైళ్లు సేవలు అందుబాటులో ఉండవని చెప్పారు.