passport service centers will be open on saturdays Hyderabad
mictv telugu

విదేశాలకు వెళ్లే వారికి శుభవార్త… ఇక అలాంటి ఇబ్బందేమీ లేదు

August 28, 2022

2

మీలో ఎవరైనా చదువు కోసం, ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్లే ఆలోచనలో ఉన్నారా? పాస్‌పోర్ట్ కు అప్లై చేశారా? అయితే ఈ శుభవార్త మీ కోసమే. ఇకపై శనివారాల్లోనూ పాస్‌పోర్టు కేంద్రాలు సేవలు అందించనున్నాయి. ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు హైదరాబాద్‌ ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారి దాసరి బాలయ్య శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఇప్పటివరకూ వారంలో కేవలం ఐదు రోజులు మాత్రమే పాస్‌పోర్టు సేవా కేంద్రాలు పనిచేస్తున్నాయన్న అధికారి బాలయ్య… విదేశాలకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకున్న వందల మంది సమస్యను ఎదుర్కొంటున్నారని చెప్పారు. వారి అప్లికేషన్లను పరిష్కరించేందుకు తక్కువలో తక్కువగా 3 వారాల సమయం పడుతోందన్నారు. ఈ సమస్యను ఇటీవల ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయాన్ని సందర్శించిన వీసా, పాస్‌పోర్టు విదేశీ మంత్రిత్వశాఖ కార్యదర్శి ఎ.సయీద్‌ దృష్టికి తీసుకెళ్లామని, అందుకు ఆయన సానుకూలంగా స్పందించారన్నారు. విదేశాలకు వెళ్లే వారి సౌకర్యార్థం శనివారం కూడా పాస్‌పోర్టు సేవా కేంద్రాలు కార్యకలాపాలు కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారని బాలయ్య వివరించారు. సెప్టెంబరు 3 నుంచి హైదరాబాద్‌ ప్రాంతీయ కార్యాలయం పరిధిలోని టోలీచౌకీ, బేగంపేట, అమీర్‌పేటతోపాటు నిజామాబాద్‌, కరీంనగర్‌లోని పాస్‌పోర్టు కేంద్రాలు కూడా ప్రతి శనివారం పనిచేస్తాయని వివరించారు.