పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కల్యాణ్, ఆయన అభిమానుల గురించి మాజీ హీరో, ప్రస్తుత పాస్టర్ రాజా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫ్యాన్స్ వల్ల పవన్ రాజకీయ జీవితానికి ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించారు. ఫ్యాన్స్ తామే జనసేనకు బలం అనుకుంటున్నారు కానీ, బలహీనత కూడా వాళ్లే అని గుర్తించలేకపోతున్నారని అభిప్రాయపడ్డారు. ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఆయన గతంలో జరిగిన సంఘటనల గురించి మాట్లాడారు. ‘గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉండగా, కాంగ్రెస్ తరపున ప్రచారం చేశాను. ఆ సందర్భంలో పవన్ కల్యాణ్‌ను పార్టీ పరంగా విమర్శించాను తప్పితే ఆయనతో వ్యక్తిగత వివాదాలు లేవు. ఈ విషయం అర్ధం చేసుకోలేని ఆయన అభిమానుల్లోని ఓ వర్గం నన్ను టార్గెట్ చేసింది. తల్లి, భార్య, మూడేళ్ల కూతురు గురించి చాలా దారుణంగా మాట్లాడారు. అంతేకాక, నేను చనిపోయానని ప్రచారం చేశారు. ఇవి చూసి నా కుటుంబ సభ్యులు కూడా ఆందోళనకు గురయ్యారు. కానీ, నేను ఎలాంటి రియాక్షన్ ఇవ్వలేదు. ఎందుకంటే నాకు పవన్ కల్యాణ్ గురించి తెలుసు. ఆయనతో బంగారం అనే సినిమా చేశాను. ఆయన వ్యక్తిత్వం నాకు తెలుసు కాబట్టి మూర్ఖులైన ఓ వర్గం అభిమానుల చర్యలకు నేను స్పందించలేదు. అంతేకాకా, పవన్ కల్యాణ్‌తో కూడా ఈ విషయం చెప్పలేదు. ఈ విషయం ఆయన దాకా రాదని నాకు తెలుసు. కానీ, ఫ్యాన్స్ ఓ విషయం తెలుసుకోవాలి. ఓ వర్గం అభిమానుల దుశ్చర్యల వల్ల పీకే రాజకీయ జీవితానికి ప్రమాదకరం. వీళ్ల చేష్టల వల్ల ప్రజల్లో రాంగ్ సూచనలు వెళ్లిపోతాయి. ఓ సారి నాపై పీకే ఫ్యాన్స్ దాడి చేసినప్పుడు వైసీపీ వాళ్లు పోలీస్ స్టేషన్‌కు వచ్చి రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ విషయం వైఎస్ జగన్ గారికి కూడా తెలుసు’ అంటూ నాటి సంఘటనలను గుర్తు చేసుకున్నారు.