పాతాళభైరవి శిల్పి ఇకలేరు.. నిర్మాత, దర్శకుడు కూడా..  - MicTv.in - Telugu News
mictv telugu

పాతాళభైరవి శిల్పి ఇకలేరు.. నిర్మాత, దర్శకుడు కూడా.. 

August 21, 2019

‘పాతాళభైరవి’.. ఈ పేరు వినగానే తెలుగువారి కళ్లుముందు ఎన్టీఆర్, ఎస్వీఆర్‌లతోపాటు నాలుక ముందుకు సాచి భయపెట్టే పాతాళభైరవి విగ్రహం కూడా కళ్లముందు మెదులుతుంది. సినిమాకు కీలకమైన ఈ దేవత విగ్రహాన్ని తయారు చేసిన శిల్పి, దర్శకనిర్మాత యెర్నేని రంగారావు ఇక లేరు. 92 ఏళ్ల రంగారావు వృద్ధాప్య సమస్యలతో ఆదివారం కన్నుమూశారు. ఈ రోజు కృష్ణాజిల్లా గుజరలో అంత్యక్రియలు పూర్తయ్యాయి.

విజయా స్టూడియోలో పెయింటరుగా.. 

రంగారావు 20 ఏళ్ల వయసులో సినీరంగంలో అదృష్టాన్ని పరీక్షించుకోడానికి మద్రాస్ రైలెక్కారు. విజయా స్టూడియోలో మౌల్డర్, పెయింటర్ గా కెరీర్ ప్రారంభంచారు. ఆయన ప్రతిభను గుర్తించిన దర్శక దిగ్గజం కేవీ రెడ్డి.. పాతాళభైరవి విగ్రహ తయారీ పనని అప్పగించారు. రంగారావు కేవలం విగ్రహాలు, సెట్టింగుల తయారీకే పరిమితం కాకుండా కెవీ రెడ్డితోపాటు హెచ్ఎం రెడ్డి వంటి ప్రముఖ దర్శకుల వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గానూ  పనిచేశారు. బాపు ఫిలిమ్స్ పేరుతో సొంత బ్యానర్ స్థాపించి1963లో ఎన్టీఆర్, షావుకారు జానకితో ‘సవతికొడుకు’ సినిమాను నిర్మించి దర్శకత్వం వహించారు. కొత్తతారాగణంతో వచ్చిన మాయావి, అర్చన సినిమాలు కూడా ఆయన తీసినవే. 1990లలో అమెరికా వెళ్లిన ఆయన అక్కడా శిల్పాలతోపాటు పెయింటింగులు కూడా సృజించారు. 2000లో అమెరికా ప్రభుత్వం ఆయన పౌరసత్వం మంజూరు చేసింది. అయితే సొంతగడ్డపై మమకారంతో 2002లో భారత్ కు తిరిగొచ్చారు.