గ్రామంలో దేవుడి ఉత్సవానికి చందా ఇవ్వలేదన్న కారణంతో ఓ కుటుంబాన్ని తమ కులం నుంచి బహిష్కరించారు పెద్దలు. ఆ కుటుంబానికి ఎవరూ సాయం చేయవద్దని హుకుం జారీ చేశారు. వారికి కిరాణా సరుకులు కానీ, మెడికల్ షాప్లో మందులు కూడా ఇవ్వకపోవడంతో చేసేదేంలేక న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించారు ఆ కుటుంబసభ్యులు. ఈ ఘటన ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని నేలపట్లలో చోటుచేసుకుంది.
గ్రామంలోని దళిత వాడలో పది రోజుల క్రితం బంగారు మైసమ్మ ఉత్సవాల కోసం ఉత్సవ కమిటీ సభ్యులు, కులపెద్దలు చందాలు వసూలు చేశారు. కులస్తులంతా ఇంటికి రూ.1,500 చొప్పున వేసుకోవాలని నిర్ణయించారు. ఈ క్రమంలో కలకొండ వీరబాబు అనే వ్యక్తి ఇంటికి వెళ్లి చందా అడగగా, తాను కొత్తగా ఇల్లు కట్టుకుంటున్నానని, చందా ఇవ్వలేనని చెప్పాడు. దీంతో ఆగ్రహించిన కులపెద్దలు వీరబాబుకు కులస్తులు ఎవరూ సహాయం చేయవద్దని హుకుం జారీ చేశారు. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో వీరబాబు, అతడి తల్లి సుగుణమ్మ కులపెద్దల వద్దకు వెళ్లి రూ.1,500 ఇస్తామని చెప్పగా.. తాము అడిగినప్పుడు ఇవ్వనందున ఇప్పుడు రూ.10 వేలు ఇవ్వాలని కులపెద్దలు అన్నారు. దీంతో చేసేదేమీలేక వీరబాబు కుటుంబసభ్యులు న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించారు.