దేశంపై అందరికీ ప్రేమ ఉంటుంది. దాన్ని వ్యక్తీకరించడానికి చాలా దారులు ఎంచుకుంటారు. జెండా వందనం, ముఖంపై మూడురంగుల పతాకాన్ని చిత్రించుకోవడం, దేశభక్తి గీతాలను ఆలపించండం.. ఎన్నెన్నో చేస్తుంటారు. దేశరక్షణకు ప్రాణాలొడ్డి పోరాడుతున్న సైనికులపైనా మనకు ప్రేమ ఉంటుంది. వారికేమైనా అయితే అయ్యో అంటాం. నివాళి అర్పిస్తారు. విరాళాలు అందజేస్తాం. అమరుల సంస్మరణ పేరుతో కార్యక్రమాలు నిర్వహించుకుంటాం. అయితే ఢిల్లీకి చెందిన విజయ్ హిందుస్తానీలా అమర జవాన్లకు నివాళి అర్పించిన మనిషి మాత్రం మనదేశంలో లేనేలేడు. అతని పేరులోనే కాదు, దేహమంతా దేశభక్తే.
అందరూ తల్లిదండ్రుల పేర్లనో, జీవిత భాగస్వాముల పేర్లనో, లేకపోతే దేవుళ్ల పేర్లనో ఒంటిపై పచ్చబొట్టుగా పోయించుకుంటారు. కానీ విజయ్.. అమరజవాన్లను తలచుకుంటూ వారి పేర్లను ఒంటిపై పొడిపించుకున్నాడు. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 173 మంది అమరు పేర్లను శాశ్వతంగా మార్చుకున్నాడు. పాకిస్తాన్తో జరిగిన కార్గిల్ యుద్ధం, అనంతనాగ్, పుల్వామా దాడుల్లో బలైపోయిన సైనికుల పేర్లను తెలుసుకుని వారికి అలా నివాళి అర్పించాడు. అంతేకాకుండా ఛాతీపై సీఏఏ(పౌరసత్వ సవరణ చట్టం), ఎన్సార్సీల పేర్లు కూడా పొడిపించుకున్నాడు. అతణ్ని ఢిల్లీ ప్రజలు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. జవాన్లంటే తనకు చిన్నప్పటి నుంచీ ఎంతో గౌరవం ఉందని, దేశం కోసం ప్రాణాలను గడ్డిపోచల్లా అర్పించిన వారి రుణాన్ని మనం ఎన్నడూ తీర్చుకోలేమని విజయ్ హిందుస్తానే అంటున్నాడు.