ప్లాస్టిక్ బాటిళ్లలో పోస్తారు.. అవి చూపితే.. - MicTv.in - Telugu News
mictv telugu

ప్లాస్టిక్ బాటిళ్లలో పోస్తారు.. అవి చూపితే..

January 13, 2020

Petrol Pump.

దిశ ఘటన అనంతరం పెట్రోల్ బంక్‌లపై సైబరాబాద్‌ పోలీసులు ఆంక్షలు కట్టుదిట్టం చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్లాస్టిక్‌ బాటిల్స్‌ లేదా జెర్రీ కేసెస్‌లో పెట్రోల్ విక్రయించడంపై నిషేధం ఉన్నా పలు పెట్రోల్‌ బంక్‌లు వాటిని పాటించకపోవడంతో కొన్ని సార్లు నేరాలకు అవకాశం ఏర్పడుతోంది. అయితే అత్యవసర పరిస్థితుల్లో వాహనం ఎక్కడో ఆగిపోయినప్పుడు వారు బాటిల్‌లో పెట్రోల్ కోసం వచ్చినప్పుడు కొన్ని పెట్రోల్ బంకులవారు వారికి పెట్రోల్ పోయడంలేదు. ఆ సమయంలో వారివద్ద గుర్తింపుకార్డు లేకపోవడంతో వాహనదారులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. 

దీనిపై సైబరాబాద్ పోలీసు కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ మాట్లాడుతూ.. అత్యవసర పరిస్థితుల్లో ఇంధనం అవసరం ఉన్న కొనుగోలుదారుడి చిరునామా, గుర్తింపుకార్డు జిరాక్స్‌ ప్రతులతో పాటు ఫోటోలు ఇస్తేనే విక్రయించాలని, లేని పక్షంలో పెట్రోల్‌ బంకు సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. నియమ నిబంధనలు పాటించని కొనుగోలుదారులు, పెట్రోల్‌బంక్‌ సిబ్బందిపై ఐపీసీ 188 సెక్షన్‌ కింద కేసు నమోదు చేస్తామని వెల్లడించారు. కొనుగోలుదారుడు తప్పుడు చిరునామా ఇస్తే ఇతర సెక్షన్లలు కూడా నమోదుచేసి చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ కేసుల్లో నెల నుంచి ఆరు నెలల వరకు జైలు శిక్ష పడుతుందని అన్నారు. 

ప్లాస్టిక్ బాటిళ్లలో పెట్రోల్ కొనడం, అమ్మడం నేరం అన్నారు. దీనిపై పెట్రోల్ పంప్ యాజమాన్యం, సిబ్బందికి అవగాహన కలిగిస్తున్నాం అని తెలిపారు. వాహనదారులు పెట్రోల్ పంపుకు వచ్చి తమ వాహనాల్లోనే ఇంధనాన్ని నింపుకోవాలని వెల్లడించారు. ప్లాస్టిక్‌ బాటిళ్లలో కొనుగోలు చేసిన పెట్రోల్‌ ఉపయోగించి కొందరు వ్యక్తులు హత్యలకు పాల్పడి మృతదేహాలను తగలబెడుతున్నారని, మరికొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఫిర్యాదులు అందుతున్నాయి. దీంతో నిబంధనలు మరింత కట్టుదిట్టం చేశామని తెలిపారు.