pavan kalyan ippatam tour tention
mictv telugu

పులివెందులలో మీపై నుంచి హైవే వేస్తాం

November 5, 2022

గుంటూరు జిల్లా ఇప్పటం గ్రామంలోని పవన్ కల్యాణ్ పర్యటనలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. రోడ్డు విస్తరణ పనులు పేరుతో కూల్చివేసిన ఇళ్లను జనసేనాని పరిశీలించారు. ఈ క్రమంలో పవన్‌ను పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర గందరగోళం ఏర్పడింది. ఇప్పటం గ్రామానికి పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో కాలినడకనే గ్రామానికి వెళ్లారు. జాతీయ రహదారిపై సుమారు మూడు కిలోమీటర్ల మేర పవన్ నడిచి వెళ్లడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో పోలీసులు కాస్త వెనక్కి తగ్గి వాహనాల్లో వెళ్లేందుకు పవన్‌కు అనుమతి ఇచ్చారు. దీంతో పవన్ కల్యాణ్.. తన కారు పైనే కూర్చొని ప్రజలకు అభివాదం చేస్తూ ఇప్పటం చేరుకున్నారు.

ఇళ్ళను కూల్చివేసిన ప్రతీ ఇంటికి వెళ్లి పవన్ వారికి ధైర్యం చెప్పారు. బాధితులందరికీ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. జనసేన సభకు భూములు ఇచ్చారనే ఇప్పటంపై కక్ష పెంచుకున్నారని మండిపడ్డారు.” వైసీపీ నాయకులారా ఖబడ్ధార్..ఇలాగే చేస్తే పులివెందులలో మీ మీద నుంచి హైవే వేస్తాం. గుంతలు పూడ్చలేరు కానీ.. ఇళ్లను కూల్చుతారా ? కనీసం మాట్లాడకుండా ఆపడానికి మీరెవరూ ?కాకినాడ, రాజమహేంద్రవరం రోడ్లు వెడల్పు చేయరా ? ఎమ్మెల్యే ఆర్కే ఇళ్లు పెదకాకాణిలో రహదారి విస్తరణ లేదా అని పవన్ ప్రశ్నించారు.

అధికారులు స్ఫృహ తెచ్చుకొని పని చేయాలని సూచించారు పవన్ కల్యాణ్. తాను రక్తం చిందించడానికి సిద్ధమే కానీ వెనక్కి తగ్గేది లేదన్నారు.
పోలీసులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా, అడ్డుకున్నా మౌనంగా ముందుకెళ్లాలని పార్టీ శ్రేణులకు పవన్ దిశానిర్ధేశం చేసారు. మార్చిలో జనసేన సభకు స్థలం ఇస్తే…ఏప్రిల్‌లో ఇళ్లు కూల్చేస్తామని నోటీసులు ఇచ్చారన్నారు. మీ కూల్చివేత ప్రభుత్వం త్వరలోనే కూలిపోతుందని పవన్ వ్యాఖ్యానించారు.