అరేబియా సముద్రంపై పవన్ హన్స్ హెలికాప్టర్ ల్యాండింగ్ అవుతున్న సమయంలో జరిగిన ప్రమాదంలో ముగ్గురు ఓఎన్జీసీ ఉద్యోగులతో సహా నలుగురు ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు. అరేబియా సముద్రంపై వెళ్తున్న ఒక హెలికాప్టర్ సడెన్గా అదుపుతప్పింది. అది ల్యాండ్ అవ్వాల్సిన ప్రాంతంలో కాకుండా మరోచోట ప్రమాదవశాత్తూ నీటిపై పడిపోయింది.
అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. మంగళవారం ఉదయం 1146 గంటలకు మారిటైమ్ రెస్క్యూ కోఆర్డినేషన్ సెంటర్-ఎంఆర్సిసి (ముంబై)కు ఆస్ట్రేలియన్, ఇండియన్ ఎంసీసీ నుంచి ఈఎల్టీ డిస్ట్రెస్ అలర్ట్ అందుకుంది. ముంబై హైలో ఓఎన్జీసీ విధులకు పనిచేస్తున్న పవన్ హన్స్ హెలికాప్టర్ (సికోర్స్కీ ఎస్-76డి) నుంచి ఈ హెచ్చరికను ఎంఆర్సిసీ ముంబై వెంటనే గుర్తించింది. ఓఎన్జీసీ హెలికాప్టర్ లో ఇద్దరు పైలట్లు, 07 మంది సిబ్బందితో చమురు ప్లాట్ ఫామ్ పై అత్యవసర ల్యాండింగ్ కు ప్రయత్నిస్తుండగా సముద్ర నీటిపై పడిపోయింది. అయితే దానికి ఉన్న ఫ్లోటర్ల సాయంతో నీటిపై తేలగలిగింది.
ఈ విషయం తెలిసిన వెంటనే రంగంలోకి దిగిన ఓఎన్జీసీ, భారత తీర దళం బృందాలు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి తొమ్మిది మందిని బయటకు తీసుకువచ్చారు. ఆ సమయంలో నలుగురు స్పృహతప్పి ఉన్నట్లు గుర్తించారు. బాధితులందరినీ వెంటనే ఆస్పత్రికి తరలించగా అందులో నలుగురు ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ ప్రమాదం నుంచి అందరూ సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారని తొలుత వార్తలు వచ్చాయి. కానీ నలుగురు ప్రాణాలు కోల్పోయారని ఓఎన్జీసీ అధికారులు క్లారిటీ ఇచ్చారు. అయితే, హెలికాప్టర్ ఎందుకు అత్యవసరంగా ల్యాండ్ అవ్వాల్సి వచ్చిందన్న విషయంపై మాత్రం ఇంకా స్పష్టత రాలేదు.