తెలంగాణలో చాలా ప్రాంతాల్లో తను పర్యటించానని, రాష్ట్ర సమస్యలపై అవగాహన చేసుకోవాల్సి ఉందని జనసేన అధినేత, సినీనటుడు పవన్ కల్యాణ్ అన్నారు. తెలంగాణ ప్రాంతం అభివృద్ధి చెందుతోందని, తమ పార్టీ తెలంగాణలో ఏడు నుంచి 14 ఎంపీ స్థానాల్లో పోటీ చేయాలనుకుంటోందని చెప్పారు. ఆయన మంగళవారం కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకుని విలేకర్లతో మాట్లాడారు. జగన్ ప్రభుత్వంతో పోలిస్తే కేసీఆర్ పాలన బావుందని కితాబిచ్చారు. ‘‘ఆంధ్రప్రదేశ్తో పోలీస్తే తెలంగాణ బాగా అభివృద్ధి చెందుతోంది. ఏపీతో పోల్చి మాత్రమే ఇలా చెబుతున్నాను. తెలంగాణ యువత సమస్యలు వింటున్నాను. పోలీస్ రిక్రూట్మెంట్ అభ్యర్థులు తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని నన్ను కోరారు’’ అని పవన్ తెలిపారు. రాజకీయ కారణాలతో తన ప్రచార వాహనం ‘వారాహి’కి పూజలు చేసుకోడానికి ఏపీ ప్రభుత్వం అనుమతించలేదని మండిడ్డారు. సాయుధ పోరాటం నుంచి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దాకా తెలంగాణ ప్రజలు పోరాట పటిమ చూపారని కొనియాడారు.