రెండు చోట్లా ఓడిపోయానని చివరికి డైమండ్ రాణి రోజా కూడా మాట్లాడుతోంది. మీకోసం చివరికి డైమండ్ రాణితో కూడా తిట్లు తింటున్నానని ప్రజలనుద్దేశించి జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. గురువారం శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో నిర్వహించిన యువశక్తి బహిరంగసభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా అధికార వైసీపీ, సీఎం జగన్ పై పలు విమర్శలు చేశారు. ‘ఎవడ్రా మనల్ని ఆపేది. ఇప్పుడున్న లీడర్లు ప్రజల గురించి కాకుండా వారి బిడ్డల గురించి మాత్రమే ఆలోచిస్తున్నారు.
సినిమాలు చేస్తున్నప్పుడు కూడా ప్రజల గురించే ఆలోచించా. ఖుషీ తర్వాత ఇంకెంత స్టార్ డం, పేరు ప్రఖ్యాతులు, డబ్బులు వచ్చినా మనశ్శాంతి ఉండదనిపించింది. అందుకే ప్రజల కష్టాలను తీర్చడానికి రాజకీయాల్లోకి వచ్చా. పార్టీ పెట్టినప్పుడు నా దగ్గర రూ. 13 లక్షలే ఉన్నాయి. ఎవరైనా ప్యాకేజీ స్టార్ అంటే చెప్పుతో కొడతానని గతంలోనే చెప్పా. నేను చూడని డబ్బా? ఉత్తరాంధ్ర గురించి ఏ నాయకుడు పట్టించుకోవట్లేదు.
1280 ఎకరాలు తాకట్టు పెడితే ఇక్కడి మంత్రులు ఏం చేస్తున్నారు? ఇప్పుడు కొత్తగా మూడు ముక్కలాట అంటున్నారు. ఉత్తరాంధ్ర ప్రత్యేకంగా ఏర్పడితే అప్పడంలా నమిలేస్తారు. మాట్లాడితే మూడు పెళ్లిళ్లు అంటున్నారు. మీ నాన్న వైఎస్ నే ఎదిరించి పోరాడా? నువ్వెంత? గతంలో నా సభలకు జనం విపరీతంగా వచ్చేవారు. కానీ ఓట్లు వేయలేదు. ఓట్లు వేస్తేనే కదా పోరాడే బలం వచ్చేది. కనీసం పది మంది ఎమ్మెల్యేలు ఉన్నా బలంగా పోరాడేవాడిని.
నాకు కులం మద్ధతివ్వకపోయినా పర్వాలేదు. కులాలు, ప్రాంతాలు, మతాల మధ్య చిచ్చుపెట్టి గెలవాలనుకోవట్లేదు. జాషువా చెప్పినట్టు విశ్వనరుడి వైపు పయనిస్తున్నా. ఉత్తరాంధ్రకు ఎన్నో సమస్యలు ఉన్నాయి. ప్రాణం పోయినా రాజకీయాలను వదిలేది లేదు. చివరి వరకు పోరాడతా. ఇది నా మూడో తీర్మానంగా రాసుకోండి’ అంటూ ఉద్వేగంగా ప్రసంగించారు.