కేసీఆర్ డైరెక్షన్.. పవన్ కల్యాణ్ యాక్షన్! - MicTv.in - Telugu News
mictv telugu

కేసీఆర్ డైరెక్షన్.. పవన్ కల్యాణ్ యాక్షన్!

February 12, 2018

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధన కోసం నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ జేఏసీ(సంయుక్త కార్యాచరణ కమిటీ)ని ఏర్పాటు చేయడానికి తీవ్రంగా యత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఇంతవరకు తన పార్టీ, ఎన్నికల్లో పోటీ, ప్రత్యామ్నాయ రాజకీయాలు అంటూ ఏవేవో మాట్లాడిన పవన్ ఉన్నట్టుండి జేఏసీ మంత్రం ఎందుకు పఠిస్తున్నట్టు? ఒక్క కేసీఆర్‌ను తప్ప దాదాపు అన్ని పార్టీలనూ విమర్శిస్తున్న జనసేనాని.. తన పార్టీ రాజకీయాలను కాకుండా జేఏసీ రాజకీయాలపై ఎందుకు ప్రధానంగా దృష్టి సారిస్తున్నారు? ఈ ప్రశ్నలకు జవాబు తెలంగాణ పాలక నాయకత్వంలో ఉంది..!!

తెలంగాణ జేఏసీ తరహాలో ఏపీలో ఒక జేఏసీని ఏర్పాటు చేస్తానని పవర్ స్టార్ ప్రకటించడం తెలిసిందే. తెలంగాణ జేఏసీ లక్ష్యం రాష్ట్ర సాధన. ఆ కల నెరవేరింది. భౌగోళిక తెలంగాణ కాదు ప్రజాస్వామిక తెలంగాణ కావాలని టీజేఏసీ చెబుతోంది. రేపో మాపో పార్టీగా మారనుంది.  

మరి పవన్ జేఏసీ లక్ష్యం ఏంటి? ఏపీకి ప్రత్యేక హోదాతోనే సరిపెడుతుందా? లేకపోతే ప్రత్యామ్నాయ రాజకీయ కూటమిగా ముందుకు సాగుతుందా? పవన్, ఆయనతో చేతులు కలుపుతున్న జయప్రకాశ్ నారాయణ్, ఉండవల్లి అరుణ్ కుమార్ వంటి నేతల చర్చలు, ప్రకటనలు చూస్తుంటే ఏపీ జేఏసీకి పక్కా ప్రణాళిక ఉన్నట్లు తెలుస్తోంది. దీన్ని కేవలం ప్రత్యేక హోదా సాధనకే కాకుండే ఏపీలో వచ్చే ఎన్నికల్లో ప్రధాన పార్టీల అవకాశాలపైనా ప్రభావం చూపేలా తీర్చిదిద్దతున్నట్లు కనిపిస్తోంది..

రాజ్‌భవన్‌లో మంతనాలు..

గత నెల రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ గౌరవార్థం గవర్నర్ నరసింహన్ రాజ్ భవన్‌లో విందు ఇచ్చారు. తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్, పవన్ గంటన్నరకు పైగా విడిగా మాట్లాడుకున్నారు. తర్వాత కేసీఆర్, చంద్రబాబులు కూడా ముచ్చటపెట్టుకున్నారు. గతంలో ఉప్పూనిప్పులా ఉన్న కేసీఆర్, పవన్‌ల మధ్య గంటన్నరపాటు చర్చించాల్సిన అంశాలమేముంటాయి? ఈ భేటీ తర్వాత కొన్నిరోజులనే పవన్ తెలంగాణలో మాదిరి జేఏసీని ఏర్పాటు చేస్తానని ప్రకటించడం గమనార్హం. ఈ భేటికి ముందు కూడా న్యూ ఇయర్ సందర్భంగా పవన్.. కేసీఆర్‌ను కలసి మంతనాలు జరపడం తెలిసిందే.  

జగన్‌కు చెక్ పెట్టేందుకు?

ఏపీకి ప్రత్యేక హోదా సాధన కోసం జేఏసీ ఏర్పాటు చేయాలని కేసీఆర్ సలహా ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. భేటీలో ఏపీ అంశాలను పవన్ చర్చకు పెట్టగా.. పార్టీలు విడివిడిగా పోరాడితే కేంద్రం స్పందించని నేపథ్యంలో కలసి వచ్చే అందర్నీ కలుపుకుని జేఏసీతో ముందుకెళ్లాలని కేసీఆర్ చెప్పినట్లు సమాచారం. ఏపీ జేఏసీలో సహజంగానే జనసేన, పవన్- బాబు అనుబంధం వల్ల టీడీపీ, కాంగ్రెస్, లెఫ్ట్ తదితర తోక పార్టీలు చేరతాయని, దీంతో గొంతును బలంగా వినిపించొచ్చని కేసీఆర్ సూచించారని అంటున్నారు. అయితే జగన్ మోహన్‌రెడ్డి సారథ్యంలోని వైకాపా.. సహజంగానే ఈ పార్టీలకు వ్యతిరేకం కనుక అది జేఏసీలోకి వచ్చే అవకాశం లేదు.

దీంతో ‘హోదా జేఏసీ’ చివరికి కాస్తా వైకాపా వ్యతిరేక జేఏసీగా మారిపోతుంది. జగన్ హవాకు అడ్డుకట్ట వేయాలని పవన్, చంద్రబాబు తీవ్రంగా చేస్తున్న యత్నాలకు ఈ జేఏసీ మరో అస్త్రంగా మారిపోతుంది. కేసీఆర్ ఈ అంశాలన్నింటిని దృష్టిలో ఉంచుకునే జేఏసీ సూచన ఇచ్చారని తెలుస్తోంది. పవన్ పార్టీకి సొంతంగా బరిలోకి దిగే శక్తిసామర్థ్యాలు ఇంకా సమకూరని నేపథ్యంలో ఆయన జేఏసీ రాజకీయాతో ముందుకెళ్లడం తప్ప మరో ప్రత్యామ్నాయం లేదని కేసీఆరే కాకుండా లెఫ్ట్, ఇతర పార్టీల, దళిత ప్రజాసంఘాల నేతలు కూడా సూచిస్తున్నారు…!!