ఆస్తులు తెలంగాణకు, అప్పులు ఏపీకి.. పవన్ కల్యాణ్ - MicTv.in - Telugu News
mictv telugu

ఆస్తులు తెలంగాణకు, అప్పులు ఏపీకి.. పవన్ కల్యాణ్

April 6, 2018

ఏపీకి ప్రత్యేక హోదా కావాలంటున్న నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ మళ్లీ చరిత్రను తవ్వాడు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించారని, ఏపీకి తీవ్ర అన్యాయం చేశారని మండిపడ్డారు. ఆయన శుక్రవారం విజయవాడలో గంటసేపు పాదయాత్ర చేసి, తర్వాత మీడియాతో మాట్లాడారు. ‘ఆస్తులేమో తెలంగాణకు ఇచ్చారు. అప్పులను ఆంధ్రకు ఇచ్చారు. విభజన హామీలు నెరవేరుస్తారని ఎన్నికలు జరిగిన ఏడాది పాటు వేచి చూశాం. రాష్ట్ర ప్రభుత్వం, ప్రధాన ప్రతిపక్ష పార్టీ కేంద్ర ప్రభుత్వంపై మొదటి నుంచి పోరాటం చేయలేకపోయాయి..’ అని విమర్శించారు.  
ఏపీకి కేంద్ర చేస్తున్న అన్యాయంపై తొలిసారి సభ పెట్టింది తానేనని అన్నారు. ‘ప్రత్యేక ప్యాకేజీని పాచిపోయిన లడ్డు అని విమర్శించాను. కానీ అవే కావాలని చంద్రబాబు కోరుకుంటున్నారు. వైకాపా విపక్ష పాత్ర నిర్వహించడంలో విఫలమైంది.. కేంద్రం మొదట్లో ప్రత్యేక హోదా ఇస్తామంది. తర్వాత ప్యాకేజీ అంది. చివరికి అదీ ఇవ్వలేదు. విభజనతో నష్టపోయిన ఏపీకి సీనియర్ నాయకుడి అనుభవం కావాలనే నేను 2014 ఎన్నికల్లో చంద్రబాబుకు మద్దతిచ్చాను..’ అని పవన్ సమర్థించుకున్నారు.