బాబుపై పవన్ కల్యాణ్‌ దాడికి ఇదీ అసలు కారణం! - MicTv.in - Telugu News
mictv telugu

బాబుపై పవన్ కల్యాణ్‌ దాడికి ఇదీ అసలు కారణం!

March 15, 2018

ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడులు దార్శకులు, రాష్ట్ర, దేశ భాగ్యవిధాతలు అని గతంలో ఎన్నోసార్లు పొగిడిన జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లో ఉన్నట్టుంది ఇంత మార్పు ఎందుకొచ్చింది? మోదీ ఏపీకి చేసిందేమీలేదని, బాబు సర్కారు అవినీతిలో కూరుకుపోయిందని దయ్యుబట్టడం వెనుక ఏ కారణాలు పనిచేశాయి? ఏపీకి ప్రత్యేక హోదా కావాలని జనం రోడ్లెక్కుతున్నా.. పైపై విమర్శలతో, మధ్యమధ్యలో సినిమా షూటింగులతో ఇన్నాళ్లూ సరిపెడుతూ వస్తున్న పవన్ నిన్న జనసేన నాలుగో వార్షికోత్సవ సభలో బాబుతోపాటు ఆయన కొడుకునూ ఏకిపారేసారు ఎందుకు?

విమర్శలు, సొంత పార్టీ ఉనికి కోసం

Related image

పై ప్రశ్నలకు ఒకటి సమాధానం కాదు, చాలా సమాధానాలు వస్తాయి. తన సినిమాలు ఇటీవల బాక్సాఫీస్ వద్ద బోల్తాకొడుతుండడంతో పవన్ పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వస్తున్నట్టు ప్రకటించడం తెలిసిందే. త్వరలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఆయన హాట్ టాపిక్‌గా మారిన ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని గట్టిగా పట్టుకున్నారు. ఇది కేంద్రంతో ముడిపడిన సమస్య. మరోపక్క.. ఇంతవరకు దారీతెన్నూ లేకుండా నడుస్తున్న జనసేనకు స్పష్టమైన నిర్మాణం ఇవ్వాల్సిన అవసరం ఉంది. లేకపోతే తన అన్న స్థాపించిన  ప్రజారాజ్యం పార్టీలా కాలగర్భంలో కలసిపోవాల్సి ఉంటుంది. అలాగే బాబు చేతిలో తాను కీలు బొమ్మ అని గట్టిగా వస్తున్న విమర్శలను తిప్పికొట్టాల్సిన పరిస్థితి. ఇకముందూ ఇలాగే ఒక సభ, ఆరు నెలల గ్యాప్ అన్నట్లు వ్యవహరిస్తే ప్రజలే కాకుండా ఇతర పార్టీలు జనసేనను సీరియస్‌గా తీసుకోవు. మరోవైపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా హోదా విషయంలో గట్టిగా పోరాడుతోంది. టీడీపీ, వైకాపా ఎంపీలు పార్లమెంటులో పట్టు వదలకుండా నిరసనలతో హోరెత్తిస్తున్నారు. చివరకు మోదీ సర్కారుపై అవిశ్వాసానికీ సిద్ధమయ్యారు.

కనిపించని జేఎఫ్‌సీ ప్రభావం..

ఏపీకి అన్యాయం జరిగిందని, ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనన్న డిమాండ్‌కు బలం కోసం పవన్ జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ(జేఎఫ్‌సీ) ఏర్పాటు చేసిన వరుస సమావేశాలు నిర్వహించడం తెలిసిందే. నిజనిర్ధారణ అంటూ ఒక నివేదికను కూడా వెలువరించారు. అందులోనివన్నీ పాత అంశాలే. ఏపీ ప్రజల ఉద్యమాలను, పార్లమెంటులో ఎంపీల భారీ నిరసనలనే  కేంద్రం లెక్క చేయడం లేదు. ఇలాంటి నిజనిర్ధారణలు, చర్చలతో కాలయాపన చేస్తే కేంద్రం కాదు కదా, రాష్ర్ర్ర్ట ప్రజలు కూడా పట్టించుకోరని పవర్ స్టార్‌కు అర్థమైంది. అంతేకాకుండా తన విమర్శలు కూడా గురితప్పుతున్నట్లు ఆయన ఆలస్యంగానైనా సరే గుర్తించారు.

దూకుడు తప్పదు..

Related image

ప్రత్యేక హోదా రాకపోవడానికి కేంద్రంలోని బీజేపీనే కారణం. చంద్రబాబు పాత్ర చాలా పరిమితం. ఆయనా హోదా కావాలంటున్నారు కనుక ఆయనపై విమర్శలు పనిచేయడంలేదు. ఈ విషయంలో జగన్‌ను విమర్శించడానికి అవకాశం లేదు. హోదా ఇవ్వలేడం లేదని ఎక్కడో దూరంగా ఉన్న మోదీని విమర్శిస్తే జనం పట్టించుకోవడం లేదు. దీంతో తన ప్రస్తుత ఉనికిని నిలుపుకుంటూ,  భవిష్యత్తులోనైనా బలమైన రాజకీయ నాయకుడిగా ఎదగాలంటే దూకుడు పెంచక తప్పదని పవన్ భావిస్తున్నట్లు కనిపిస్తోంది. అందుకే పాత స్నేహాలను పక్కన బెట్టి బాబుపై అవినీతి, అక్రమాల ఆరోపణలు సంధించారు. దీంతో కలవరపడిన బాబు వెంటనే ఎదురుదాడికి దిగారు. మోదీనీ పవన్‌తో ఇలా మాట్లాడిస్తున్నారని నిందించారు. నిన్నటి వరకు పాలునీళ్లలా కలసి ఉన్న పవన్, బాబుల మధ్య ఇప్పుడు ఏ గడ్డీ వేయకున్నా నిప్పు రాజుకుంటోంది!  ఇది తాత్కాలికమేనా, ఎన్నికల వరకూ కొనసాగుతుందా అన్నది మరో ఆసక్తికర అంశం..!