రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న అత్యాచారాలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. అత్యాచారాలను ఆపటంలో ప్రభుత్వం విఫలమైందని, ఆ బాధ్యత పోలీసు ఉన్నతాధికారులు తీసుకోవాలని సూచించారు. అంతేకాక, హైకోర్టు కూడా సుమోటోగా స్వీకరించి మహిళల రక్షణకు తగిన ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ‘ఆడబిడ్డలను కాపాడడం వైసీపీ ప్రభుత్వానికి ఎలాగూ చేతకాదు. తమ పిల్లలను కాపాడే బాధ్యత తల్లిదండ్రులే తీసుకోవాలి.
ఆరేళ్ల చిన్నారి నుంచి అరవై ఏళ్ల ముసలి వాళ్ల వరకు అత్యాచారాలు జరుగుతున్నాయి. మహిళలు ధైర్యంగా తిరిగే పరిస్థితులను ప్రభుత్వం కల్పించాలి. బాధితురాలి పేరు బయట పెట్టొద్దంటూ చట్టం ఉన్నా, పాలకులు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. పాలకులను నమ్మే పరిస్థితి ప్రస్తుతం రాష్ట్రంలో లేదు. అసలు ఈ అత్యాచారాలు ఎందుకు జరుగుతున్నాయి? ఎలా కట్టడి చేయాలనే అంశంపై సీఎం ఇంతవరకు సమీక్ష చేయకపోవడం దురదృష్టకరం. నేను ప్రభుత్వాన్ని నిందించట్లేదు. సూచనలు మాత్రమే చేస్తున్నా’నని పేర్కొన్నారు.