‘కోనసీమ’పై పవన్ కల్యాణ్ హాట్ కామెంట్స్ - MicTv.in - Telugu News
mictv telugu

‘కోనసీమ’పై పవన్ కల్యాణ్ హాట్ కామెంట్స్

May 25, 2022

కోనసీమ జిల్లా పేరు మార్పు మూలంగా తలెత్తిన వివాదం, అమలాపురంలో ఉద్రిక్తతలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ బుధవారం స్పందించారు. మంగళగిరిలో ఉన్న పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ తీరును తప్పుబట్టారు. ‘కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరును జిల్లాల విభజన చేసినప్పుడే పెడితే బాగుండేది. ప్రభుత్వం ఎందుకు జాప్యం చేసిందో అర్ధం కావడం లేదు. అప్పుడే పెడితే ఇప్పుడ ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు వచ్చే వ్యతిరేకత విషయంలో ప్రభుత్వం సున్నితంగా వ్యవహరించాలి. పొట్టి శ్రీరాములును ఒక జిల్లాకు పరిమితం చేశారు. నది తక్కువగా ప్రవహిస్తున్న చోట కృష్ణా జిల్లా పేరు పెట్టారు. మేం వ్యక్తులకు కాదు జిల్లాల పేర్లకు వ్యతిరేకం. ఏ జిల్లాకు లేకుండా కోనసీమ జిల్లాకే అభ్యంతరాల స్వీకరణకు ఎందుకు సమయమిచ్చారు. అభ్యంతరాల వెల్లడికి సామూహికంగా కాకుండా వ్యక్తులుగా రమ్మన్నారు. అంటే గొడవలకు ప్లాన్ చేసి వ్యక్తులను టార్గెట్ చేశారా? మంత్రి ఇంటిపై దాడి జరుగుతుంటే పోలీసులు చూస్తూ ఊరుకుంటారా? దాడికి ముందే మంత్రి కుటుంబ సభ్యులను తరలించారు. అంటే దాడి జరుగుతుందని ముందే తెలుసా? ఘోరాలు జరుగుతున్నా ఆపకుండా చూస్తారా? పైగా కుల రాజకీయాలతో జనసేన మీద అభాండాలు వేస్తున్నారు. భావోద్వేగాలు ఉంటాయని తెలిసీ రెచ్చగొట్టారు’ అని తీవ్రస్థాయిలో ప్రభుత్వంపై మండిపడ్డారు.