ఆ లెక్కేందో చూపించేందుకు రెఢీ అంటున్న పవర్ స్టార్........ - MicTv.in - Telugu News
mictv telugu

ఆ లెక్కేందో చూపించేందుకు రెఢీ అంటున్న పవర్ స్టార్……..

August 1, 2017

నాకొంచెం తిక్కుంది దానికో లెక్కుందని…. చెప్పిన గబ్బర్ సింగ్ ఇప్పుడు ఆ లెక్క ఏంటో చూపించేందుకు రెఢీ అవుతున్నారు.  పాలిటిక్స్ లో ఢీ అంటే ఢీ అనేందుకు రెఢీ అయ్యాయనే సిగ్నల్ కూడా ఇచ్చారు.  అంతా బాగానే ఉన్నా ఇంకా లెక్కల్లో ఏదో తికమక ఉన్నట్లే అన్పిస్తున్నది. అమరావతిలో  తాను పూర్తి స్థాయిలో రాజకీయ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చినా కూడా  కార్యాచరణపై క్లారిటీ రావడం లేదు.

జనసేనాని పవర్ స్టార్ పవన్  కళ్యాణ్ అక్టోబర్ నుండి పూర్తి స్థాయి రాజకీయ నాయకుడిగా మారుతానని అంటున్నారు. రెండేళ్ల కాలంగా సభలు,  సమావేశాలు పెడుతూ వచ్చారు. ఉద్దానం సమస్య తర్వాత పూర్తి స్థాయిలో రాజకీయాలు చేస్తానని అంటున్నారు. అంత వరకు  రాజకీయ శిక్షణా  తరగతులు కూడా ముగుస్తాయని అంటున్నారు. పూర్తి స్థాయి సమయాన్ని ఎపి పాలిటిక్స్ పై  పెడ్తారన్నట్లు. ఈ విషయాన్ని అమరావతిలో ఆయన చెప్పారు. విశాఖ నుండి విజయవాడ వచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో భేటీ అయ్యారు. ఉద్దానంలో జనం  ఎదుర్కొంటున్న కిడ్నీ సమస్యలపై మాట్లాడారు. చంద్రబాబు నాయుడు బాగానే స్పందించారని చెప్పారు.

అయితే సభలు సమావేశాలు పెట్టి పొలిటికల్  ఎజెండా ఏమీ ఇవ్వని పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయి రాజకీయాలు ప్రారంభించిన తర్వాత ఎవర్ని టార్గెట్ చేసుకుంటారో తెలియదు. ఇప్పటి వరకైతే రెండు తెలుగు రాష్ట్రాల సిఎంలు బాగానే పనిచేస్తున్నారని చెప్పారు. ఇప్పుడు కూడా బాబు గారు  భేష్ అని చెప్పారు. అంతా భేష్ అన్నాక మరి ఈయనతో పనేంటో.

ఏ సమస్యను తీసుకుని జనంలోకి  వెళ్లాలని అనుకుంటున్నారో తెలియడం లేదు. రాజకీయ శిక్షణా తరగతుల్లో ఏ రాజకీయాల  గురించి రంగరించి పోశారో. ముందు ముందుపోస్తారో కూడా  తెలియడం లేదు. హోదా కోసం పెద్ద ఎత్తున సభలు  పెట్టిన పవన్ బాబు…. ఆ తర్వాత కేంద్రానికి సౌత్, నార్త్ ఫీలింగ్స్ గురించి  షాక్ ఇచ్చారు.  సౌత్ ఇండియన్  రాజకీయాల్లో కీ రోల్ ప్లే చేస్తారా అంటే దానిపైనా క్లారిటీ రావడం లేదు. అస్సలు ఆయన గ్రౌండ్ ఏందో కూడా అర్థం కావడం లేదు.

అంటే వచ్చే ఎన్నికల నాటికి అందరూ మంచి వారే అని చెప్పుకుంటూ పోతారో ఏమో మరి. ఆయన ఎట్లా ఉన్నా సరే కాని జన సేన సంగతి ఏమిటో మరి. సోషల్ మీడియా నుండి జనం లోకి వెళ్తున్నందుకు ఇప్పటికైనా సంతోషమే అయితే  క్లారిటీ మాత్రం ఇచ్చి తీరాల్సిందే. పోయిన ఎన్నికలప్పుడు విశాఖలోసభ పెట్టి ఏమీ  తేల్చకుండానే జనాలను నిరాశ పర్చారు. మరి ఈ సారైనా ఎన్నికల్లో పోటీ చేసి తన సత్తా ఏమిటో… తన లెక్క ఏమిటో సరి చేసి చూపిస్తారో లేక పోతే జన సేనకు డైరెక్షన్ ఏమీ ఇవ్వకుండా వెండితెరపై ఓ కాలు.. రాజకీయాల్లో మరో కాలు పెట్టి కాలం వెళ్లదీస్తారో చూడాలి.