ఇసుక కష్టాలు, మేస్త్రీ ఆత్మహత్య.. ఆదుకున్న పవన్ కల్యాణ్ - MicTv.in - Telugu News
mictv telugu

ఇసుక కష్టాలు, మేస్త్రీ ఆత్మహత్య.. ఆదుకున్న పవన్ కల్యాణ్

October 27, 2019

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆత్మహత్య చేసుకున్న ఓ మేస్త్రీ కుటుంబానికి లక్ష రూపాయల సాయం ప్రకటించి పెద్దమనసు చాటుకున్నారు. ఏపీలో ఇసుక కొరత లక్షలాది మంది కార్మికుల పొట్ట కొడుతోందని పవన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో నిన్న గుంటూరు జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న మేస్త్రీ నాగ బ్రహ్మాజీ ఆత్మహత్య గురించి తెలుసుకున్న ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బ్రహ్మాజీ మరణం తనను తీవ్రంగా కలచివేసిందని పవన్ ట్విటర్‌లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా మేస్త్రీ కుటుంబానికి లక్ష రూపాయల ఆర్థికసాయం ప్రకటించారు.

ఏపీలోని భవన నిర్మాణ రంగ కార్మికుల దయనీయ స్థితికి నాగ బ్రహ్మాజీ ఆత్మహత్య అద్దం పడుతోందని అన్నారు. ఏపీ ప్రభుత్వ అస్తవ్యస్త ఇసుక విధానం కారణంగా రాష్ట్రంలోని 19.6 లక్షల మంది కార్మికులు నేరుగా ప్రభావితం కాగా, మరో 10 లక్షల మంది పరోక్షంగా ఉపాధి కోల్పోయారని పవన్ పేర్కొన్నారు. పనిలేని కార్మికుల కుటుంబాలు ఇప్పుడేం చేయాలో తెలియని స్థితిలో పడిపోయారని ఆరోపించారు.