సీఏఏని సమర్థిస్తున్న పవన్ దేశద్రోహే.. నారాయణ - MicTv.in - Telugu News
mictv telugu

సీఏఏని సమర్థిస్తున్న పవన్ దేశద్రోహే.. నారాయణ

January 16, 2020

NHHTJKJHKT

నేడు జనసేన అధినేత పవన్ కల్యాణ్ బీజేపీతో పొత్తు పెట్టుకోగా సీపీఐ నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. పవన్‌వి స్వార్థ ప్రయోజనాలని .. ఆయన తమకు దూరమైనందుకు బాధ పడటంలేదని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ధ్వజమెత్తారు. కమ్యూనిస్ట్‌ భావజాలం ఉందని చెప్పుకునే పవన్‌ కల్యాణ్‌ మతతత్వ పార్టీలోకి ఎలా వెళ్లారు? అని ప్రశ్నించారు. వామపక్షాలకు బాకీలేదన్న ఆయన.. ప్రజాస్వామ్యానికి మాత్రం బాకీ పడ్డారని అన్నారు. ‘అవకాశవాదంతో పార్టీలు మారడం సహజమే. దానికి సిద్ధాంతాలు నచ్చాయని చెప్పడం ఎందుకు? ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వని బీజేపీతో కలిసి పవన్‌ రాష్ట్రానికి ఏ ప్రయోజనాలను కాపాడతారు? సీఏఏ, ఎన్నార్సీని సమర్థించిన నరేంద్ర మోదీ, అమిత్‌ షా దేశద్రోహులు. అలాంటి చట్టాలను సమర్థిస్తున్న పవన్‌ కూడా దేశద్రోహే’ అని విరుచుకుపడ్డారు. 

మరోవైపు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పవన్‌ కల్యాణ్‌ది అవకాశవాద రాజకీయమని ఆరోపించారు. ‘గతంలో ఏపీకి పాచిపోయిన లడ్డూలు ఇచ్చారన్న ఆయనకు నడ్డాను కలిసిన తర్వాత మంచి బందరు లడ్డూలు ఇచ్చారా? అసలు బీజేపీతో పవన్ ఎందుకు కలుస్తున్నారో చెప్పాలి. చేగువేరా ఆదర్శమన్న పవన్ ‘చెంగువీర’ అయ్యారు.  ఢిల్లీ వెళ్లిన నేతలు జేఎన్‌యూకు వెళ్తే.. పవన్‌ మాత్రం బీజేపీ కార్యాలయానికి వెళ్లారు. దమ్మున్నవాడే బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడతారు. పవన్‌ దమ్ముందో లేదో సమాధానం చెప్పాలి’ అని రామకృష్ణ అన్నారు.