తోకకు తోకలా.. పవన్ వెంట లెఫ్ట్.. ఏం సాధిస్తారో? - MicTv.in - Telugu News
mictv telugu

తోకకు తోకలా.. పవన్ వెంట లెఫ్ట్.. ఏం సాధిస్తారో?

April 6, 2018

ఎర్రజెండా.. ఒకప్పుడు దేశావ్యాప్తంగా చెరగని ముద్ర వేసి, అచ్చమైన ప్రజా రాజకీయాలకు చిహ్నంగా ఎగరిన బావుటా. కాలమహిమతో జెండా రంగు వెలిసిపోయింది. వెలిసిపోయిన రంగుతోనే ఉండిపోయినా గౌరవం మిగిలి ఉండేది. కానీ ఉనికి, కోసం ప్రాపకం కోసం కనిపించిన నానా చెత్తాచెదార, నీచనికృష్ట రంగుల జెండాలన్నిటితో జట్టుకట్టి మరింత అపఖ్యాతిని మూటగట్టుకున్నారు కామ్రేడ్లు. మారుతున్న పరిస్థితులకు తగ్గట్టు ఉద్యమాలను నిర్మించుకోలేక.. ధన,కుల నానా బలాలతో బలిసిపోయిన పార్టీల అండకోసం పాకులాడుతున్న విషాదం ప్రస్తుత ఎర్రజెండాది.అన్నీ అయిపోయాక.. జనసేనతో

ఏపీలో టీడీపీ, కాంగ్రెస్‌లతో కామ్రేడ్ల పొత్తులు, వైఫల్యాల చరిత్ర అందరికీ తెలిసిందే. కాంగ్రెస్ ఉనికిలో లేకపోవడంతో, మొన్నటివరకు మతతత్వ బీజేపీతో అంటకాగిన టీడీపీతో వెళ్తే జనం తిడతారనే భయంతో.. వెరసి లెఫ్ట్ పార్టీలు ప్రత్యామ్నాయ తోడు కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నాయి. సినిమాలకు స్వస్తి పలికి పూర్తిస్థాయి రాజకీయాల్లో వచ్చిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారికి దేవుడిలా కనిపించాడు. పవన్‌తో పొత్తు పెట్టుకుంటే వచ్చే ఎన్నికల్లో కాసిని సీట్లయినా దక్కుతాయని ఆశ. అయితే జనసేన ఇంకా ఒక పార్టీగా నిలదొక్కుకోనే లేదు. ఏపీలోని పల్లెప్రాంతాల్లో ఆ పార్టీ గురించి తెలియని ప్రజలే ఎక్కువ.

తోకలా ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తితో..

పవన్ కల్యాణ్.. మొన్నటివరకు టీడీపీకి, బీజేపీకి తోకలా వ్యవహరిస్తున్నాడని ఆరోపణలు ఉన్నాయి. వాటితో అనుబంధాన్ని తెంచుకుంటున్నట్లు పవన్ ప్రకటించినా ప్రజలు అనుమానంగానే చూస్తున్నారు. చిరంజీవి చేసిన రాజకీయాలను తమ్ముడు కూడా చేస్తాడేమోనని అనుమానపడుతున్నాయి. తాను ఎవరికీ తొత్తును కానని, సర్వస్వతంత్రుడినని పవన్ ప్రకటించుకున్నారు. ఇది కామ్రేడ్లకు నచ్చింది.

ఫలితం ఉంటుందా?

ఏపీలో అధికార టీడీపీ, విపక్ష వైకాపాలకు క్షేత్రస్థాయి నుంచి పట్టు ఉంది. జనసేనకు పట్టణాల్లోనే ఇంతవరకు శ్రేణులు ఏర్పడలేదు. అందుకే పవన్ కల్యాణ్ విస్తృతంగా సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. కానీ ఎన్నికలకు గట్టిగా ఏడాది వ్యవధి కూడా లేకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ స్థాయి నుంచి కేడర్‌ను ఏర్పాటు చేసుకోవడం, మద్దతును ఓట్లలోకి మార్చుకోవడం కష్టమే. అయితే పవన్, వామపక్షాలు జట్టుకట్టడం వల్ల ఓట్లు రాకపోయినా కొన్ని ప్రయోజనాలు నెరవేరతాయి. తాను టీడీపీకి, బీజేపీకి తొత్తు అని ఉన్న ఆరోపణ నుంచి పవన్ బయటపడతారు. పవన్ సభలకు కామ్రేడ్లు పెద్ద సంఖ్యలో జనాన్ని తరలించి కళ తెస్తారు.

పవన్ వల్ల వామపక్షాలకు కాస్త లబ్ధి చేకూరే అవకాశముంటుంది. ఇప్పటికీ రాష్ట్ర స్థాయిలో సరైన నాయకత్వం లేక ఇబ్బంది పడుతున్న సీపీఎం, సీపీఐలకు ప్రజాకర్షణ ఉన్న నాయకుడు తోడవుతాడు. అతణ్ని ఒప్పించి, తాము కోరినన్ని సీట్లలో పోటీ చేసే అవకాశం ఉంటుంది. అయితే టీడీపీ, వైకాపాతో పొత్తుపెట్టుకుంటే ఈ సదుపాయం ఉండదు. గెలుస్తామా? ఓడిపోతామా? అన్నది లెఫ్ట్‌కు ముఖ్యం కాదు. కేవలం ఉనికి కాపాడుకోవడమే ప్రధానం కనుక, ఎక్కువ చోట్ల పోటీలో నిలబడ్డానికి, ఇంకా తాము ఉన్నామని చెప్పుకోవడానికి పవనే సరైన జోడీ. కానీ ముందే చెప్పుకుంటున్నట్లు సభలు, సమావేశాలు, ఉనికి, పత్రికాప్రకటనలు, ఇంకా వీలైతే ఎన్నికల్లో ఒకటో రెండో సీట్లల్లో గెలుపుకు తప్పిస్తే పవన్‌తో పొత్తు వల్ల లెఫ్ట్ పార్టీలకు ఒరిగేదేమీ ఉండదని రాజకీయ విశ్లేషకుల అంచనా.