పవన్ కల్యాణ్ స్టయిల్‌కు అభిమానులు పడిపోతారు. పవర్ స్టార్ సినిమాల్లోనే కాదు, నిజ జీవితంలోనూ ఏం చేసినా వార్తే. రాజకీయాల్లో తన జయాపజయాలతో సంబంధం లేకుండా నిత్యం వార్తల్లో ఉంటారు. తెరపై కనిపించే ఆయన జీవితంపై జనానికి ఎంత ఆసక్తో తెరవెనక జీవితం గురించి విమర్శకులకు అంత ఆసక్తి. తరచూ మూడు పెళ్లిళ్ల ప్రస్తావనపై వివాదాలు రగులుతూ ఉంటాయి. తాను చక్కగా పెళ్లిళ్లు చేసుకున్నానని, పెళ్లి చేసుకోకుండా అక్రమ సంబంధాలు నడపడం లేదని పవన్ కూడా ఘాటుగా బదులిస్తుంటారు. చాలా ఇంటర్వ్యూలల్లోనూ ఆ విషయం ప్రస్తావనకు వచ్చినా పైపైనే స్పందిస్తుంటారు. కానీ తాజాగా బాలయ్యకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ తన పెళ్లిళ్లపై మనసు విప్పి మాట్లాడారు.
ఆహా ఓటీటీలో వచ్చే ‘అన్‌స్టాపబుల్’ కార్యక్రమంలో బాలకృష్ణ పవన్‌తో ముచ్చటిస్తూ ‘మూడు పెళ్లిళ్ల గొడవేంటి?’ అని ప్రశ్నించారు. దీనికి పవన్ స్పందిస్తూ.. ‘‘నిజానికి నేను పెళ్లి చేసుకోకండా బ్రహ్మచారిగా మిగిలిపోవాలనుకున్నా. ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే ఇన్ని పెళ్లిళ్లు చేసుకుంది నేనేనా అనిపిస్తుంది. పెళ్లిళ్లను నేను ప్లాన్ చేసుకోలేదు. తొలి పెళ్లి ఇంట్లోవాళ్లు చేశారు. కొన్ని కుదరవు కాబట్టి విడిపోవాల్సి వచ్చింది. రెండో పెళ్లి అభిప్రాయ భేదాల వల్ల అలా అయింది. నేనేమీ వ్యామోహంతో పెళ్లిళ్లు చేసుకోలేదు. మూడు పెళ్లిళ్లు మూడు పెళ్లిళ్లు అని విమర్శిస్తుంటే.. అవి ఒకేసారి చేసుకోలేదని చెప్పాలనిపిస్తుంది. రాజకీయాల్లో ఉన్నాను కాబట్టి ఈ విషయం వాళ్లకు ఆయుధంగా మారింది’’ అని పవన్ అన్నారు. తనకు సినిమాలంటే ఇష్టం ఉండేది కాదన్న పవన్ అత్తయ్య, వదినల ప్రోత్సాహంతోనే సినిమాల్లోకి వచ్చానని చెప్పుకొచ్చారు.