వపన్ పాలిటిక్స్...కొత్త ట్రెండ్... - MicTv.in - Telugu News
mictv telugu

వపన్ పాలిటిక్స్…కొత్త ట్రెండ్…

October 25, 2018

ఈ మధ్య కాలంలో తెలుగు రాష్ట్రాల రాజకీయ నాయకులు జాతీయస్థాయిలో చక్రం తిప్పేందుకు తహతహ లాడతున్నట్లుంది. గతంలో ఎన్టీఆర్, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ఫ్రంట్ల పేరుతో జాతీయ  స్థాయిలో తమకంటూ స్థానం సంపాదించుకున్నారు. వాళ్లు నిలబడినా పడిపోయినా సరే ప్రయత్నాలంటూ చేస్తూ వచ్చారు. కొద్ది రోజుల కింద కేసీఆర్ కూడా ఫెడరల్ ఫ్రంట్ అంటూ జాతీయ స్థాయిలో పార్టీలను కూటమి కట్టేందుకు ప్రయత్నాలు చేశారు. ఆతర్వాత చంద్రబాబు నాయుడు కూడా అదే ప్రయత్నాలు చేశారు. తాజాగా  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా జాతీయ స్థాయిలో ఫ్రంట్ కోసం లేదంటే జాతీయ స్థాయి పార్టీలతో కల్సి కొత్త రాజకీయ సమీకరణకు తెర తీసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లుంది.Pawan kalyan politics… new trendఅందుకే యూపీలో  బిఎస్పీ అధినేతను కలిసేందుకు ఆయన వెళ్లారు. ప్రాంతీయ పార్టీల  నాయకులు జాతీయ స్థాయిలో కీ రోల్ ప్లే చేయాలని అనుకోవడం మంచిదే. కానీ రాష్ట్ర రాజకీయాల్లో  తమ రోల్‌ను వదిలి అక్కడికి వెళ్తారా. లేకపోతే ఇక్కడ ఉంటూనే అక్కడ రోల్ ప్లే చేస్తారా అనేది చూడాలి. ఇప్పటివరకు తెలుగు నాయకులు వివిధ ప్రాంతీయ పార్టీలను ఏదో ఒక జాతీయ పార్టీ మద్దతుతో   జాతీయ రాజకీయాలను ప్రభావితం చేశారు. సినిమారంగం నుండి వచ్చిన పవన్ కళ్యాణ్ కూడా దాన్నే ఫాలో అవడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టుంది. కొంతమంది ప్రొఫెసర్లు, విద్యార్థులను వెంట తీసుకుని పవన్ కళ్యాణ్ యూపికి వెళ్లారు. దళిత, బహుజన  భావనను ఏపి ప్రజల్లోకి తీసుకెళ్లేందుకే ఆయన యూపి పర్యటన పెట్టుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. దాంతోపాటుగా జాతీయ స్థాయిలో కూడా జనసేన ఇమేజ్‌ను పెంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారమూ జరుగుతోంది.

యూనైటెడ్ ఫ్రంట్, నేషనల్ ఫ్రంట్, ఫెడరల్ ఫ్రంట్. ఇలా ఫ్రంట్లు కట్టించింది తెలుగు నాయకులే. తాజాగా పవన్ కళ్యాణ్ ఏ ఫ్రంట్ కట్టిస్తారో తెలియదు.

ఫ్యాన్ ఫాలోయింగ్ నుండి మాస్ పొలిటికల్ ఫాలోయింగ్‌కు తాను మారే ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకే ఏపిలో ఉన్న పెద్ద పెద్ద నాయకులను తట్టుకుని యాత్రలు చేస్తున్నారు. ఓటు బ్యాంకు పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. సామాజిక సమీకరణల ద్వారా తాను ముందుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నట్లుంది.

బిఎస్పీని కలిసిన తర్వాత మరికొన్ని పార్టీల నాయకులనూ కలుస్తాడనే ప్రచారం జరగుతోంది.  జాతీయస్థాయి రాజకీయాల గురించి పెద్ద నాయకులు ఎవ్వరూ మాట్లాడటం లేదు. చంద్రబాబు నాయుడు, కేసీఆర్ పూర్తి స్థాయిలో ఎన్నికల వ్యవహారంలో ఉన్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్  జాతీయస్థాయి రాజకీయాల గురించి మాట్లాడుతున్నారు. జాతీయస్థాయి పార్టీలను కలుపుకుని ఏదో ప్రయోగం చేయాలని భావిస్తున్నట్లుంది.

తనకు మద్దతుగా నిలిచే మీడియాను పెంచుకుంటున్నట్లే వుంది పవన్ తీరు.  గతంలో ఆయన కోసం ఓ టీవీ ఛానెల్ కొన్నారు. ఓ పత్రిక కూడా ఆయనకు అందుబాటులోకి వచ్చింది. మరో టీవీఛానెల్ కూడా పవన్ కోసం రెఢీ అయినట్లు సమాచారం. ఇటు ప్రచారాలు, జాతీయస్థాయిలో భేటీలుకు మీడియా సపోర్టు కూడా బాగా తీసుకుంటున్నారు. రాజకీయాల్లో తాను సెంటర్ పాయింట్ అయ్యేందుకు తీవ్రంగానే ప్రయత్నిస్తున్నారు.

తెలుగు నేల నుండి జాతీయ రాజకీయాలను  ప్రభావితం చేసిన నాయకులు కామ్ అయిన తర్వాత ఇప్పుడు పవన్ లేచి ఓ అడుగు ముందుకేశారు. ఆయన అక్కడ స్థిరంగా నిలబడతాడా లేకపోతే వ్యూహంలో భాగంగానే ఇలా చేశాడనే  అనేది తర్వాత తెలుస్తుంది. ఇప్పటి వరకైతే పవన్ కళ్యాణ్ క్లాస్ నుండి మాస్ వరకు అటు నుండి తన పొలిటికల్ ఇమేజ్‌ను మరింత పెంచుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారనేది మాత్రం వాస్తవం.