నాగబాబు వివాదంపై స్పందించిన పవన్  - MicTv.in - Telugu News
mictv telugu

నాగబాబు వివాదంపై స్పందించిన పవన్ 

May 23, 2020

Pawan Kalyan

ఈ మధ్య సినీ నటుడు, జనసేన పార్టీ నేత నాగబాబు జాతిపిత మహాత్మాగాంధీ గురించి సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్న విషయం తెలిసిందే. దీనిపై పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు నాగబాబు సామాజిక మాధ్యమాల్లో వ్యక్తపరుస్తున్న అభిప్రాయాలు పూర్తిగా ఆయన వ్యక్తిగతమని.. ఆయన అభిప్రాయాలతో పార్టీకి ఎటువంటి సంబంధం లేదని పవన్‌ వెల్లడించారు. ఈ మేరకు శనివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. నాయకుల వ్యక్తిగత అభిప్రాయాలతో జనసేన పార్టీకి ఎలాంటి సంబంధం లేదని పవన్‌ స్పష్టం చేశారు. కొన్ని సున్నితమైన అంశాలపై ఈ మధ్య పార్టీకి చెందినవారు వ్యక్తం చేస్తున్న భావాలను పార్టీ అభిప్రాయాలుగా ప్రత్యర్థులు వక్రీకరిస్తున్నారని పేర్కొన్నారు. 

వివిధ అంశాలపై పార్టీ అభిప్రాయాలు, నిర్ణయాలను పార్టీ అధికారికంగా ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూనే ఉందని అన్నారు. అలా అధికారికంగా చేసిన ప్రకటనలు మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. కరోనా వైరస్‌తో పోరాడుతూ ప్రజలు నానా అవస్థలు పడుతున్నారని.. ఈ సమయంలో ప్రజాసేవ తప్ప మరే ఇతర అంశాల జోలికి వెళ్లకుండా క్రమశిక్షణతో ముందుకు సాగాలని పవన్‌ కల్యాణ్‌ పార్టీ శ్రేణులకు సూచించారు. కాగా, తాజాగా నాగబాబు కరెన్సీ నోట్లపై గాంధీ బొమ్మకు బదులు సావర్కర్, అబ్దుల్ కలాం, పీవీ నరసింహారావు, భగత్ సింగ్, సర్దార్ వల్లాబాయ్ పటేల్ చిత్రాలు కూడా ఉంటే బాగుంటుందని అభిప్రాయపడ్డారు.