పవర్ స్టార్ కాదు.. ప్యాకేజీ ఆర్టిస్ట్! - MicTv.in - Telugu News
mictv telugu

పవర్ స్టార్ కాదు.. ప్యాకేజీ ఆర్టిస్ట్!

December 7, 2017

తన అన్న చిరంజీవిని మోసం చేసి అధికారంలోకి రాకుండా అడ్డుకున్న వారిపై ప్రతీకారం తీర్చుకుంటానని పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై నటి, వైకాపా నేత రోజా మండిపడ్డారు. చిరంజీవికి ద్రోహం చేసింది పవన్, ఆయన బావ అల్లు అరవిందేనని, పవన్ మొదట చిరంజీవికి క్షమాపణ చెప్పుకోవాలని ఎద్దేశా చేశారు.  పవన్ కల్యాణ్.. పవర్ స్టారేమీ కాదని, అతగాడు అద్దెకు దొరికే  ఓ ప్యాకేజీ ఆర్టిస్టని ఆమె ఘాటు వ్యంగ్యాస్త్రం సంధించారు. చంద్రబాబు  ప్రభుత్వం  ఇబ్బందుల్లో పడ్డప్పుడు పవన్‌కు ఓ ప్యాకేజీ ఇచ్చి బయటికి తీసుకొచ్చి ప్రచారం చేయిస్తుంటారని, అందుకే ఆయన టీడీపీని పల్లెత్తు మాట అనడని అన్నారు.  “మీ అన్నకు ద్రోహం చేసిన వాళ్లలో మొదట నువ్వున్నావు… తర్వాత మీ బావ అల్లు అరవింద్ ఉన్నాడు.. ఆ తరువాత చంద్రబాబు, ఆయనకు బాకా వూదే టీవీ చానళ్లు ఉన్నాయి. మీరందరూ కలిసి చిరంజీవిని నాశనం చేసి ఇంటికి పంపించారు. ఈ రోజు మళ్లీ ఎవరో చేశారని,  వాళ్లను వదిలిపెట్టను అంటున్నావు.. ఇది చాలా హాస్యాస్పదంగా ఉంది’ అని రోజా అన్నారు. చిరంజీవి ఎన్నికల్లో 18 సీట్లు మాత్రమే గెలిచాడనగానే, పవన్ అతన్ని గాలికి వదిలిపెట్టి షూటింగుకు వెళ్లాడని, అందుకు పవన్ తనే స్వయంగా శిక్షించుకోవాలని ఆమె హితవు పలికారు. పవన్ కల్యాణ్ ఏపీ రాజకీయాల గురించి ఏమీ తెలియదని, ఆయన చుట్టపు చూపుగా రాజకీయాల్లో వస్తుంటాడని రోజా ఎద్దేవా చేశారు.

వారసత్వ రాజకీయాలను విమర్శిస్తూ వైకాపా నేత జగన్ మోహన్ రెడ్డిని ఉద్దేశించి పవన్ చేసిన వ్యాఖ్యలపై ఆమె భగ్గుమన్నారు. సినిమాల్లో మెగాస్టార్ వంశం వాళ్ల గురించి మాట్లాడాలన్నారు. ‘వారసత్వ రాజకీయాలకంటే ముందు పవన్ వారసత్వ సినిమాలపై మాట్లాడితే సుందరంగా ఉంటుంది. అసలు చిరంజీవి లేకపోతే పవన్ సినిమాల్లో ఉండేవాడా?’ అని ధ్వజమెత్తారు.