Pawan Kalyan wrote a letter to CM Jagan on pensions
mictv telugu

రామక్కకు 158 ఇళ్లు ఉన్నాయ్.. జగన్‌కు పవన్ లేఖ

December 28, 2022

Pawan Kalyan wrote a letter to CM Jagan on pensions

పెన్షన్ లబ్దిదారులకు ప్రభుత్వం నోటీసులు ఇవ్వడంపై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సీఎం జగన్ కి లేఖ రాశారు. పెన్షన్లు ఎందుకు తొలగించకూడదో చెప్పాలంటూ 4 లక్షల మందికి నోటీసులు ఇచ్చారని, కాలం గడిచే కొద్దీ లబ్దిదారులు పెరుగుతారు తప్ప తగ్గరన్నారు. ఆ లేఖలో నోటీసుల్లో పేర్కొన్న కొన్ని విషయాలను ప్రస్తావించారు. ‘పెనుగొండలో రజక మహిళ రామక్క పేరిట 158 ఇళ్లున్నాయని నోటీసులు ఇచ్చారు. నిజంగా అన్ని ఇళ్లు ఉంటే అవెక్కడున్నాయో చూపించి వాటి తాళాలు ఇవ్వండి. శ్రీకాకుళం మొళియాపుట్టి మండలంలో కొందరు వృద్ధులకు వేల ఎకరాలున్నాయని చెప్పారు.

వాటి పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తే వాళ్లే స్వచ్ఛందంగా పింఛను వదులుకుంటారు. విద్యుత్ బిల్లు ఎక్కువైందనో, ఇంటి విస్తీర్ణం ఎక్కువైందనో లబ్దిని రద్దు చేయాలనడం విచిత్రంగా ఉంది. పాతికేళ్ల ముందు చనిపోయిన వారు ఇప్పటికీ ఆదాయపన్ను కడుతున్నారు అని చూపించి వితంతు పింఛను రద్దు చేస్తామంటున్నారు. దివ్యాంగుల వైకల్యం కళ్ల ముందు కనిపిస్తున్నా సర్టిఫికెట్లు ఏవీ? అని అడుగుతున్నారు. కలెక్టర్లను తిట్టండి అని ఆదేశించడంతో మీ బాధ్యతను సరిగ్గా నిర్వర్తించానని భావిస్తున్నారా? పెన్షన్ డబ్బు పెంచుతున్నాం కాబట్టి లబ్దిదారుల సంఖ్యను తగ్గించాలని అనుకోవడం సరికాదు’ అంటూ లేఖను ముగించారు.