ఎంతైనా హీరో.మైక్ దొరికితే డైలాగ్‌లు దంచికొడతారు.వినేవారికి ఇంపుగా ఉంటాయి.పవన్ కల్యాణ్లాంటోళ్లు అయితే ఇంకా బాగా ఉంటాయి.కానీ చెప్పే డైలాగే తేడా ఉంటే…సర్రున కాలుతుంది. చరిత్రని మార్చిచెబితే చిర్రెత్తుకొస్తుంది. ఇదేం పైత్యం రా బాబు అనుకుంటాం.మాట్లాడింది ఎవరైనా సరే తెలుసుకోని మాట్లాడాలంటారు. అంతేగానీ నోటికి ఏది వస్తే అది మాట్లాడొద్దంటారు. ఇప్పుడు పవన్ కల్యాణ్ చేసింది ఇదే. తెలంగాణవాసులకు మంటపుట్టించే మాట అనేశారు. ఎన్టీఆర్ వచ్చేవరకు తెలంగాణకు వరి అన్నం తెలువదని పవన్ అన్నారు. అక్కడితోనే ఆగలేదు..పండుగలకే తినేవాళ్లు అన్నారు.ఇవే వ్యాఖ్యలు తెలంగాణవాసులకు కోపం తెప్పిస్తున్నాయి.చరిత్ర తెలుసుకుని మాట్లాడాలని పవన్ కల్యాణ్‌ని హెచ్చరిస్తున్నారు. రాసిచ్చే స్క్రిప్ట్ కాదు అసలు చరిత్ర ఏంటో తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు. అసలు పవన్ కల్యాణ్ ఏం మాట్లాడారు.? ఎందుకిలా మాట్లాడారు.? తెలంగాణ వాసులు రగిలిపోవడానికి కారణాలు ఏంటీ?
పవన్ కల్యాణ్ ఏం అన్నారంటే…
“తెలంగాణ ఇంటీరియర్ గ్రామంలో ఒక పెద్దావిడ నాతో ఇలా అన్నది. ఎన్టీఆర్ రెండురూపాయలకు కిలో బియ్యం ఇచ్చాకే అన్నం తిన్నాం. అంతకుముందు వరి బియ్యం అంటే తెలియదు అని ఆమె నాతో చెప్పింది తెలంగాణలో పండుగలకే అన్నం చేసుకునేవాళ్లు. మిగతా సమయంలో జొన్నలు, సజ్జలు తినేవారు. తెలంగాణలో నీళ్లులేక పంటలు ఎక్కువగా పండేవికాదు. అందుకే జొన్నలు, సజ్జల్నే వాడేవారు.ఎన్టీఆర్ రెండు రూపాయలకు కిలో బియ్యం ఇచ్చిన తర్వాతనే బియ్యం తినడం మొదలుపెట్టారు” అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఇప్పుడు వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. పవన్ కల్యాణ్ అజ్ఞానంతోనే అలా మాట్లాడారని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.
ఎప్పటి నుంచో
క్రీస్తుపూర్వం 1400 సంవత్సరం నుంచి దక్షిణభారతదేశంలో వరిని పండించారని పురావస్తుశాఖ అంచనాలు చెబుతున్నాయి. పంటపొలాల్లో యాభైశాతం వరినే సాగుచేశారు. దక్షిణభారతీయుల ముఖ్యమైన ఆహారం ఇది. తెలంగాణలో ఎప్పటినుంచో వరి బియ్యం తినేవాళ్లు.ఎన్టీఆర్ రాకకు కొన్ని వందల ఏళ్ల ముందు నుంచే రైతులు వరిపండించేవాళ్లు.తెలంగాణలో కాలువలు లేకపోయినా బావులపై ఆధారపడి వ్యవసాయం చేసేవాళ్లు. ఎక్కడ యాభై అడుగులు తవ్వినా పుష్కలంగా నీళ్లొచ్చేవి. ఎంత కరువొచ్చినా బావులు ఎండిపోయేవికాదు. ప్రధానంగా ఈ బావుల దగ్గర వరిని పండించేవారు. విద్యుత్ లేకపోయినా మొటకొట్టి పొలం పారించేవాళ్లు. ఇంకా వాగులు దగ్గర కూడా వరిని పండించే వాళ్లు. కాలువల్లో నీటిని గూడ వేస్తూ వరిని పండించారు.ఇలా పండిన వడ్లలను దంచి బియ్యం చేసేవాళ్లు. అలా వండిన అన్నం తెలంగాణ భాషలో బువ్వ. ఈ బువ్వ తాతల కాలం నుంచి తింటున్నారు.తెలంగాణలో జొన్నలు,సజ్జలు ఎక్కువగా పండేవి. సహజంగానే వీటిని ఎక్కువగా తినేవాళ్లు.అంతేకాదు వరిబియ్యం లేకకాదు.బువ్వ కన్నా రొట్టెలు తినేందుకే ఆ కాలం వాళ్లు ఆసక్తిచూపేవారు. అంతే తప్ప అన్నం తెలియక కాదు
ఎన్టీఆర్ వచ్చాక
ఎన్టీఆర్ రెండురూపాయలకు కిలోబియ్యం ఇవ్వకముందు నుంచే ఇక్కడ బువ్వ బుక్కలకొద్ది తినేవాళ్లు. పవన్ కల్యాణ్ అసలు నిజాలు తెలుసుకుని మాట్లాడితే బాగుంటుందని తెలంగాణవాసులు హితవుపలుకుతున్నారు.1980 తర్వాత ఎన్టీఆర్ వచ్చారు. పేదలకోసం రెండురూపాయల బియ్యం పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకంలో పేదలకు బియ్యం ఇచ్చారు. అంతేగానీ తెలంగాణలో ఎప్పటి నుంచో బియ్యం ఉన్నాయి. ఇది తెలియకుండా పవన్ కల్యాణ్ మాట్లాడారు. ఇది ఆయన అజ్ఞానికి నిదర్శమని తెలంగాణ మేధావులు మండిపడుతున్నారు.
చరిత్ర తెలుసుకుని…
అందుకే అంటారు రాసిచ్చింది కాదు…శోధించి,,పరిశోధించి స్వయంగా రాసుకుని చెప్పాలి. పూర్వకాలం నాయకులు ఇలాగే చేసేవారు.మాట్లాడేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించేవాళ్లు. కానీ ఇప్పుడు అలా లేదు. నోటికి ఏది వస్తే అదే మాట్లాడేస్తున్నారు. ఎవరో రాసిస్తే అదే చదివేస్తారు. ఏం మాట్లాడుతున్నారో వారికి అర్థం కాదు. అందుకే ఒక ప్రాంతం గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. చరిత్రను క్షుణ్ణంగా తెలుసుకోవాలి.లేదంటే జనంలో పలచన అవుతారు. సో లీడర్స్ బీకేర్ ఫుల్