PawanKalyan Meet MODI.WhatNext?
mictv telugu

ప్రధాని మోదీతో పవన్‌కల్యాణ్ 10 నిమిషాలు

November 11, 2022

ప్రధాని నరేంద్రమోదీ విశాఖలో పర్యటిస్తున్నారు. జనసేన అధినేత పవన్ కల్యాన్‌కు అపాయింట్‌మెంట్ ఇచ్చారు. పది నిమిషాల పవన్‌కు మోదీ టైమ్ ఇచ్చారు. ప్రధాని మోదీతో పవన్‌కల్యాణ్ ఏం మాట్లాడబోతున్నారు? ఏపీలోని పరిస్థితుల్ని వివరిస్తారా? ఎంతోకాలంగా ఎదరుచూస్తున్న రోడ్ మ్యాప్‌ని మోదీ ఇస్తారా? అటు అధికారిక పర్యటన, ఇటు పవన్ సమావేశం..ఏపీ రాజకీయాల్లో ఆసక్తి రేపుతున్నాయి.

క్లారిటీ ఇస్తారా?

ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన ఉత్కంఠ రేపుతోంది. అటు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు ఇటు పవన్ కల్యాణ్ భేటి
తీరంలో హీట్ పుట్టిస్తోంది. అభివృద్ధి పనులకన్నా…ప్రధానితో పవన్ ఏం మాట్లాడుతారు?అనేది రసవత్తరంగా మారింది. ఏపీలో తాజా పరిస్థితుల్ని పవన్ కల్యాణ్ మోదీకి వివరించబోతున్నారు. అలాగే రాజకీయాలపై చర్చిస్తారని తెలుస్తోంది. ఎప్పటి నుంచో బీజేపీ ఇస్తానన్న రోడ్ మ్యాప్ కోసం పవన్ కల్యాణ్ ఎదురు చూస్తున్నారు. అప్పుడు ఇప్పుడు అంటూ బీజేపీ దాటవేస్తోంది. ప్రధాని మోదీ విశాఖ టూర్‌లో దానిపై క్లారిటీ వస్తుందని సేనాని భావిస్తున్నారు.

పదే పది నిమిషాలు…

పది నిమిషాలే మోదీ టైమ్ ఇచ్చారు. ఈ పది నిమిషాల్లో కుండబద్దలు కొట్టినట్లు సూటిగా, సుత్తిలేకుండా మెయిన్ పాయింట్లు చెప్పేయాలని పవన్ ప్రిపేర్ అయ్యారు. మోదీ అంతా వింటారా లేదా కుశల ప్రశ్నలతోనే సమావేశం ముగిస్తారా? అనేది చూడాలి. ఈ సమావేశం ఏపీలో రాజకీయ సమీకరణల్ని మార్చేస్తుందని జనసేన భావిస్తోంది. పవన్ తమతోనే కలిసి పనిచేస్తారని బీజేపీ ఎప్పటినుంచో చెబుతూ వస్తోంది. మోదీ పవన్ సమావేశంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆసక్తిగా ఉన్నారు.

చంద్రబాబు మళ్లీ…

పవన్ బీజేపీతో పొత్తు ఎలాగూ ఉంటుంది టీడీపీతో పవన్‌కు మంచి దోస్తీ ఉంది. ఈ స్నేహం చంద్రబాబుని మళ్లీ బీజేపీకి దగ్గర చేస్తుందని తెలుగుతమ్ముళ్లు భావిస్తున్నారు. ఏపీలో జగన్‌ని ఢీ కొట్టాలంటే టీడీపీ, బీజేపీ, జనసేనలు కలువాల్సిందే. లేదంటే విడివిడిగా ఉంటే వైసీపీకే ప్లస్ అవుతోంది. ఎలాగైనా పవన్‌తో కలిసి బీజేపీని ఒప్పించేలా చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల్లో చంద్రబాబు ఒక్కడే జగన్‌ను ఢీ కొట్టే సీన్ లేదు. అటు బీజేపీ టీడీపీకి దూరంగా ఉంటుంది. పవన్ మాత్రం ఇద్దరి మధ్యలో ఉంటున్నారు. ఇదే ముగ్గుర్నీకలుపుతుందని అందరూ అనుకుంటున్నారు.

సేనాని దూకుడు

పవన్ కల్యాణ్ ఏపీలో దూకుడు పెంచారు.ఎక్కడ సమస్య ఉంటే అక్కడ వాలిపోతున్నారు. జనంలో కలిసిపోతూ ఇష్యూని హీటెక్కిస్తున్నారు. ఈ మధ్య టీడీపీ కన్నా ఒక అడుగు ముందే ఉన్నారు. ఇప్పటంలో సేనాని రచ్చ రచ్చ చేశారు.అవకాశం దొరికితే చాలు సర్కార్‌ని ఇరుకున పెట్టాలని చూస్తున్నారు. ప్రధానితో సమావేశం తర్వాత ఈ దూకుడు మరింత పెంచాలని పవన్ కల్యాణ్ భావిస్తున్నారు.
జగన్ స్ట్రాటజీ
కేంద్రంతో సీఎం జగన్ సఖ్యతతోనే ఉంటున్నారు. ఢిల్లీ పెద్దల చల్లని చూపులు ఇప్పటిదాకా ఉన్నాయి. జగన్ కూడా మొదటి నుంచి ఎక్కడ తేడా రాకుండా చూసుకుంటున్నారు. రాష్ట్రంలో తనపై బీజేపీ ఎగిరెగిరి పడుతున్నా..కేంద్రంతో మంచిగానే ఉంటున్నారు. మరి బీజేపీ హైకమాండ్ తీసుకోబోయే నిర్ణయంపైనే 2024 వార్ ఆధారపడింది. ఒక్కడు ఒకవైపా…ముగ్గురు ఒకవైపా అనేది వారి చేతల్లోనే ఉంది. ఏపీ బీజేపీతో పవన్ దోస్తీ వరకు ఓకే కానీ.. చంద్రబాబుని ఇప్పటికిప్పుడు కలుపుపోతారా అనేది డౌట్. ఎన్నికలదాకా వేచిచూద్దామని చెప్పే అవకాశం ఉంది. రాజకీయాల్లో ఎప్పుడు ఏమైనా జరుగొచ్చు.