ఏపీకి వడ్డీతో సహా ఇచ్చేయండి: సుప్రీం కోర్టు - MicTv.in - Telugu News
mictv telugu

ఏపీకి వడ్డీతో సహా ఇచ్చేయండి: సుప్రీం కోర్టు

April 29, 2022

భారతదేశ అత్యున్నత న్యాయస్థానం తెలంగాణ తెలుగు అకాడమీపై తీవ్రంగా మండిపడింది. వడ్డీతో సహా ఏపీకి వారంలోగా బకాయిలు చెల్లించాలంటూ సంచలన తీర్పు ఇచ్చింది. ఉమ్మడి తెలుగు అకాడమీ విభజన వ్యవహారంపై శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.

తెలంగాణ తెలుగు అకాడమీ ఏపీకీ చెల్లించాల్సిన రూ. 92.94 కోట్ల పెండింగ్ సొమ్మును వారంలోగా ఇవ్వాలని కోర్టు తీర్పును వెలువరించింది. 6 శాతం వడ్డీతో కలిపి ఇవ్వాలని, ఆస్తులు, నిధుల పంపకాలపై హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు అమల్లో ఉంటాయని తెలిపింది. ఈ చట్టం ప్రకారం తెలుగు అకాడమీ నిధులు గాని, సిబ్బందిని గాని 42:58 నిష్పత్తిలో పంచుకోవాలని ఆదేశించింది. ఈ తీర్పుతో తెలంగాణకు ఎదురుదెబ్బ తగిలింది. వారంలోగా వడ్డీతో సహా బకాయిలు చెల్లించాల్సి రావడంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు.

గతంలో విభజన చట్టం ప్రకారం ఏపీకీ రావలసిన స్థిర, చరాస్తులను వెంటనే తమకు అప్పగించాలని ఆ రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాసింది. ఉమ్మడి తెలుగు అకాడమీకి సంబంధించి తెలంగాణ అధికారులను సంప్రదించినా ఫలితం లేకపోయింది. అనంతరం ఏపీ తెలుగు అకాడమీ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించగా, కోర్టు ఏపీ తెలుగు అకాడమీకి అనుకూలంగా తీర్పు వెలువరించింది. అకాడమీలోని నిధులను, భవనాలను ఇతర స్థిర, చరాస్తులను 58:42 నిష్పత్తిలో ఇరు రాష్ట్రాలు పంచుకోవాలని స్పష్టం చేసింది. దీనిపై తెలంగాణ అకాడమీ అసంతృప్తి చెంది సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలో ఈరోజు సుప్రీంకోర్టులో జస్టిస్‌ చంద్రచూడ్‌, జస్టిస్‌ హిమాకోహ్లీ ధర్మాసనం సంచలన తీర్పునిచ్చింది.