50 వేలు కట్టు.. నీ ప్రేయసిని రప్పిస్తాం : హైకోర్టు ఆదేశం - MicTv.in - Telugu News
mictv telugu

50 వేలు కట్టు.. నీ ప్రేయసిని రప్పిస్తాం : హైకోర్టు ఆదేశం

November 21, 2022

ప్రియురాలి కోసం హెబియస్ కార్పస్ పిటిషన్ వేసిన ప్రియుడికి రాజస్థాన్ హైకోర్టు షాకిచ్చింది. ముందుగా రూ. 50 వేలు కడితే తర్వాత విచారణ తేదీ డిసెంబర్ 2న ప్రియురాలిని రప్పిస్తామని ఆదేశించింది. ఐదురోజుల్లోపు డబ్బు చెల్లించి ఆ రసీదును అడ్వకేట్ జనరల్ కి చూపించాలని, ఆ రసీదు చూసి పోలీసులు ప్రియురాలిని కోర్టులో హాజరు పరచాలని ఆదేశించింది. వివరాల్లోకెళితే.. పాలి జిల్లా సిరియారి గ్రామానికి చెందిన ఓ మహిళకు మహేంద్ర అనే యువకుడితో ఆరు నెలల కింద పెళ్లయింది.

అయితే మహిళకు పెళ్లి ఇష్టం లేదు. పేరెంట్స్ బలవంతం చేయడంతో తప్పక చేసుకుంది. ఇష్టం లేకుండానే కాపురం చేసేది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఆమెకు దినేష్ అనే యువకుడు పరిచయమవగా, అది క్రమంగా పెరిగి ప్రేమకు దారి తీసింది. దినేష్ ను పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండాలనుకొని ఇంటి నుంచి వెళ్లిపోయి దినేష్ ను కలుసుకొంది. ఇద్దరూ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవడానికి సిద్ధపడ్డారు. ఇంతలో యువతి తల్లిదండ్రుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి తల్లిదండ్రులకు అప్పగించారు. దీంతో దినేష్ హైకోర్టును ఆశ్రయించాడు. తన ప్రియురాలిని ఆమె పేరెంట్స్ బందీగా ఉంచారని అందులో ఫిర్యాదు చేశాడు. విచారించిన కోర్టు.. పిటిషనర్ 50 వేలు కట్టమని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది.