కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ వ్యాప్తంగా టెక్నాలజీ అన్ని రంగంలో వేగంగా పుంజుకుంటుంది. పది సంవత్సరాల క్రితంతో పోలిస్తే, నేడు చాలా రంగాలలో చాలా మార్పులు వచ్చాయి. ఆధునికంగా కొత్త యాంత్రాలు, కొత్త పరికరాలు, కొత్త విధానాలు, కొత్త ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. అయితే, బ్రిటీష్ పాలిష్ స్టార్టప్ వాలెట్‌మోర్ కంపెనీ తీసుకొచ్చిన కొత్త విధానం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. మరి ఏంటీ ఆ సరికొత్త టెక్నాలజీ? ఎప్పుడు అందుబాటులోకి వచ్చింది? దీనివల్ల ఉపయోగం ఏంటీ? అనే పూర్తి వివరాలను కంపెనీ వెల్లడించింది.
మనం ఏదైనా వస్తువు కొంటే ప్రస్తుతం.. ఆ వస్తువు బిల్లును కార్డు పేమెంట్ లేదా క్యాష్ పేమెంట్ లేదా తాజాగా అందుబాటులోకి వచ్చిన యూపీఐ ద్వారా చెల్లిస్తాము. కానీ, ఇవేమీ లేకుండా కేవలం చేతి ద్వారానే చెల్లింపులు చేసుకునే కొత్త విధానాన్ని బ్రిటీష్ పాలిష్ స్టార్టప్ వాలెట్‌మోర్ కంపెనీ తీసుకొచ్చింది. ఇందుకోసం మొదటగా చేయాల్సిన విధానం ఏమిటంటే.. మనిషి బాడీలోకి పేమెంట్ చిప్‌లను అమర్చుతారట. ఈ విధానాన్ని అందుబాటులోకి తెచ్చిన తొలి కంపెనీ కూడా ఇదేనట.
ఇప్పటి వరకు 500కి పైగా పేమెంట్ చిప్‌లను విక్రయించారట. ఈ చిప్‌ల సాయంతో షాపులలో, మాల్స్‌లో, హాస్పిటల్స్‌లో డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు లేదా క్యాష్ అవసరం లేకుండానే పేమెంట్లు చేసుకోవచ్చట. దీని కోసం యూజర్లు తమ చేయిని కాంటాక్ట్‌లెస్ పేమెంట్ మెషిన్ వద్ద ఉంచితే చాలట. మనీ మీ బ్యాంకు అకౌంట్ నుంచి దుకాణదారుని అకౌంట్‌కి వెళ్తాయని తెలిపారు. అయితే, ఈ విధానం వల్ల మనిషికి ఏమైనా అవుతుందా అంటే ఏం కాదట. ఈ పేమెంట్ విధానం పూర్తిగా సురక్షితమైనదని, అవసరమైన అన్ని అథారిటీల నుంచి ఈ చిప్ పేమెంట్ల కోసం ఆమోదం లభించిందని కంపెనీ తెలిపింది.
”నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్(ఎన్ఎఫ్సీ) టెక్నాలజీపై ఈ చిప్ పనిచేస్తుంది. ఇదే టెక్నిక్‌ను స్మార్ట్ఫోన్ల ద్వారా జరిపే కాంటాక్ట్‌లెస్ పేమెంట్లకు కూడా వాడుతున్నారు. కాంటాక్ట్‌లెస్ డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులలో రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ టెక్నాలజీని వాడుతున్నారు. మానవ శరీరంలో తొలిసారి 1998లో చిప్‌ను అమర్చారు. ఈ చిప్ బరువు ఒక గ్రాము కంటే తక్కువగా ఉంటుంది. బియ్యం గింజ కంటే కొద్దిగా మాత్రమే పెద్దగా ఉంటుంది” అని కంపెనీ తెలిపింది. దీనిలో మైక్రోచిప్, యాంటెనా ఉంటాయని తెలిపింది. ఇంజెక్షన్ ద్వారా ఈ చిప్‌ను బాడీలోకి పంపుతారు. ఈ చిప్‌కు ఛార్జింగ్ కూడా అవసరం లేదు. ఎక్కడైతే అమర్చారో అక్కడే స్థిరంగా ఉంటోంది. ఇది కచ్చితంగా పనులను సులభతరం చేస్తోంది. కానీ, ప్రజలు తమ సౌకర్యార్థం కోసం ఏం వదులుకోవాలో దాని గురించి ఆలోచిస్తున్నారని ఫిన్‌టెక్ నిపుణులు చెప్పారు. ప్రైవసీకి, సౌకర్యానికి మధ్య ఎక్కడి వరకు గీతలు గీసుకోవాలనుకునేది మాత్రం యూజర్ల పైనే ఆధారపడి ఉంటుందని తెలిపారు.