పేటీఎం నుంచి ‘మెసేజీ’లతో మోసపోకండి! - MicTv.in - Telugu News
mictv telugu

పేటీఎం నుంచి ‘మెసేజీ’లతో మోసపోకండి!

November 21, 2019

జాదూగాళ్లు ఎక్కడైనా ఉంటారు. నలుగురి మంచికోసం చేసే ఏ పనిలోనైనా వారు వేలు పెట్టి  పబ్బం గడుపుకుంటారు. అదే జరిగింది మనీ ట్రాన్స్‌ఫర్ యాప్ పేటీఎమ్ విషయంలో. కేవైసీ నిబంధనలు పూర్తి చెయ్యాలంటూ పేటీఎం పేరుతో నకిలీ మెసేజీలను పంపుతున్నారు. వాటితోపాటు లింకులను కూడా పంపి వాటిని క్లిక్ చేసి యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని, లేఖపోతే  ఖాతా నిలిచిపోతుందని హెచ్చరిస్తున్నారు. కొందరు ఇది నిజమని నమ్మిన చాలా మంది మోసపోవద్దని సంస్థ సీఈఓ విజయ్ శేఖర్ శర్మ తన ట్విటర్‌లో వెల్లడించారు. తన కష్టమర్లను అలర్ట్ చేశారు.

 

ఈ నకిలీ సందేశం కొన్ని లక్షల మందికి చేరిందని, దయచేసి దీనిని నమ్మవద్దని ఆయన అత్యవసర సందేశాన్ని పోస్ట్ చేశారు. ‘ఇది ఓ కేవైసీ స్కామ్. దీనిని అస్సలు నమ్మవద్దు.  పేటీఎం ఎన్నడూ ఇటువంటి వివరాలను అడగబోదు. ఏ విధమైన యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకోవాలని కూడా మేం సూచించం. బహుమతుల మాయలో పడి మీ వివరాలు చెప్పవద్దు. ఖాతా వివరాలను హ్యాక్ చేసేందుకు మోసగాళ్లు చేస్తున్న పని ఇది. దీనిపై మేం ఇప్పటికే ఫిర్యాదు చేశాం’ అని ఆయన పేర్కొన్నారు. చూశారుగా క్యాష్‌బ్యాక్, ఆఫర్స్, డిస్కౌంట్లు, గిఫ్ట్స్ వంటి అపోహలకు పోకుండా జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి సందేశాల విషయంలో.