పేటీఎంలో చైనా పెట్టుబడులు.. నిషేధించండి: కాంగ్రెస్ ఎంపీ - MicTv.in - Telugu News
mictv telugu

పేటీఎంలో చైనా పెట్టుబడులు.. నిషేధించండి: కాంగ్రెస్ ఎంపీ

June 30, 2020

Paytm

చైనాకు చెందిన 59 మొబైల్ యాప్స్‌ని నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం సోమవారం సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఆ యాప్స్ నిషేధంలో మనవాళ్లు ఎక్కువగా బాధపడుతోంది టిక్‌టాక్ విషయంలోనే. తమ టాలెంట్ నిరూపించుకోవడానికి టిక్‌టాక్ మంచి వేదిక అని భావించిన వారంతా ఇప్పుడు తీవ్రంగా కలత చెందారు. ఇదిలావుండగా పేటీఎం యాప్‌ని కూడా బ్యాన్ చేయాలని తమిళనాడు కాంగ్రెస్ ఎంపీ మనికమ్ ఠాగూర్ డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా ఆయన ట్వీట్ చేశారు. ‘చైనా యాప్స్‌ను నిషేధిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నాం. అలాగే పేటీఎంని కూడా బ్యాన్ చేసి ప్రధాని నరేంద్ర మోదీ తన 56 అంగుళాల ఛాతీని, ధైర్యాన్ని ప్రదర్శించాలి. మీరేమో ‘గో వోకల్ ఫర్ లోకల్’ అంటున్నారు. అయితే వాటికి పెట్టుబడులు ఎలా వస్తున్నాయి?’ అని ప్రశ్నించారు. ‘పేటీఎంలో చైనాకు చెందిన యాంట్ ఫైనాన్షియల్స్, అలీబాబా గ్రూపులు వరుసగా 29.71 శాతం, 7.18 శాతం పెట్టుబడులు పెట్టాయి. ఇలాంటి వాటిని నిషేధించాలి’ అని ఎంపీ మనికమ్ ఠాగూర్ ప్రధానికి విన్నవించారు. కాగా, ప్రస్తుతం ఆయన చేసిన ఈ ట్వీట్ పెద్ద దుమారమే రేపుతోంది. నెటిజన్లు పేటీఎం యాప్ చైనా యాప్ కాదని, దేశీయ యాప్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ‘ఆయన ప్రస్తావించింది ఆ యాప్‌లో చైనా పెట్టుబడుల గురించి’ అంటూ కాంగ్రెస్ శ్రేణులు వివరణలు ఇస్తున్నారు.