ఇటీవల యూపీఐ(Unified Payments Interface) మోసాలు పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. ఆన్ లైన్ ఆర్డర్స్, సైబర్ కేటుగాళ్ల మాయలో పడి యూపీఐ ప్లాట్‌ఫామ్ ఉపయోగించే కస్టమర్లు దారుణంగా మోసపోతున్నారు. వారి అకౌంట్లు క్షణాల్లో ఖాళీ అవుతున్నాయి. వారికి రక్షణ కల్పించేందుకు ఆన్లైన్ పేమెంట్స్ ప్లాట్‌ఫామ్ పేటీఎం.. కొత్తగా ‘పేటీఎం పేమెంట్ ప్రొటెక్ట్’ (Paytm Payment Protect) అనే గ్రూప్ ఇన్స్యూరెన్స్ ప్లాన్ తీసుకొచ్చింది. హెచ్డీఎఫ్సీఎర్గో (HDFC ERGO) జనరల్ ఇన్స్యూరెన్స్‌తో కలిసి ఈ ఇన్స్యూరెన్స్ ప్రొడక్ట్ ను లాంఛ్ చేసింది. దీంతో యూపీఐ కస్టమర్లు మొబైల్లో మోసపూరిత లావాదేవీలపై రూ.10,000 వరకు రక్షణ పొందొచ్చు. ఇందుకోసం కేవలం రూ.30 సంవత్సరానికి ప్రీమియం చెల్లిస్తే చాలు.
దీనిపై పేటీఎం సీఈఓ, లెండింగ్ అండ్ హెడ్ ఆఫ్ పేమెంట్స్ భవేష్ గుప్తా మాట్లాడుతూ.. కస్టమర్లను ఆన్లైన్ మోసాల నుంచి రక్షిం డానికి, సైబర్ నేరాలను ఎదుర్కోవడానికి అనుకూలమైన క్లెయిమ్‌లతో వారికి బీమా కవర్‌ను అందిస్తున్నామని తెలిపారు. HDFC ERGOతో కలసి కస్టమర్లలో ఆర్థిక అవగాహనను వ్యాప్తి చేయడం, దేశంలో సురక్షితమైన డిజిటల్ చెల్లింపుల స్వీకరణను ప్రోత్సహించే లక్ష్యంతో కలిసి పనిచేస్తున్నామని చెప్పారు.
అన్ని యాప్స్, వ్యాలెట్స్‌లో యూపీఐ పేమెంట్స్ చేసేవారికి ఈ కవరేజీ లభిస్తుంది. ఏడాదికి రూ.30 ప్రీమియం చెల్లిస్తే రూ.10,000 వరకు ఇన్స్యూరెన్స్ లభిస్తుంది. మొబైల్ వ్యాలెట్స్‌లో జరిగే మోసపూరిత లావాదేవీలకు కూడా ఇది వర్తిస్తుంది. త్వరలో ఏడాదికి రూ.1 లక్ష వరకు కవరేజీ ఇచ్చే ప్రొడక్ట్ లాంఛ్ చేస్తామని పేటీఎం ప్రకటించింది.
ఎలా అప్లై చేయాలంటే..
• పేటీఎం యూజర్లు కేవలం రూ.30 చెల్లించి రూ.10,000 బీమా కవరేజీ పొందడానికి ఇలా చేయాలి.
• పేటీఎం యాప్ ఓపెన్ చేసి Payment Protect అని సెర్చ్ చేయాలి.
• పేరు, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి Proceed to Pay పైన క్లిక్ చేసి పేమెంట్ చేయాలి.
• ‘పేటీఎం పేమెంట్ ప్రొటెక్ట్’ ఏడాది ప్లాన్ మీకు అప్లై అవుతోంది.
• పేమెంట్ ప్రొటెక్ట్ ప్లాన్ తీసుకున్న తేదీ నుంచి ఏడాది వరకు కవరేజీ ఉంటుంది.