బీజేపీని ప్రశంసించిన పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్.. చిక్కుల్లో కాంగ్రెస్ - MicTv.in - Telugu News
mictv telugu

బీజేపీని ప్రశంసించిన పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్.. చిక్కుల్లో కాంగ్రెస్

April 22, 2022

26

గుజరాత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ హార్ధిక్ పటేల్ శుక్రవారం పార్టీని ఇరుకున పెట్టే వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు అధిష్టానానికి ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇటీవలే కాంగ్రెస్ నుంచి వెళ్లిపోతానని ప్రకటించిన హార్ధిక్ తాజాగా తాను రాముడి భక్తుడిని అంటూ ప్రకటించాడు. ‘గుడ్డిగా వ్యతిరేకించడం కాదు. బీజేపీకి సంబంధించి కొన్ని మంచి విషయాలు ఉన్నాయి. వాటిని ఎవ్వరైనా అంగీకరించాల్సిందే. రాజకీయంగా బీజేపీ తీసుకున్న చర్యలను మనం ప్రశంసించాలి. అలాంటి శక్తి కేవలం బీజేపీకే ఉందన్న వాస్తవాన్ని మనం అంగీకరించాలి. గుజరాత్‌లో కాంగ్రెస్ బలంగా ఉండేందుకు కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల’న్నారు. పార్టీ మార్పు నిర్ణయంపై ప్రశ్నించగా, ‘నేను పార్టీ మారాలా? వద్దా? అన్నది ఇంకా తేల్చుకోలేదు. బీజేపీలో చేరే ఆలోచన లేదు. కేసీ వేణుగోపాల్‌తో జరిగిన భేటీలో తన పనికి కొందరు అడ్డుపడుతున్న కారణంగా సామర్ధ్యం మేరకు పనిచేయలేకపోతున్నానని చెప్పాను. పరిస్థితి ఇలాగే ఉంటే పీసీసీ బాధ్యతలు నిర్వర్తించలేనని స్పష్టం చేశా’నని వ్యాఖ్యానించారు.