ఉగ్రదాడిలో పెద్దపల్లి జిల్లా జవాను కన్నుమూత - MicTv.in - Telugu News
mictv telugu

ఉగ్రదాడిలో పెద్దపల్లి జిల్లా జవాను కన్నుమూత

July 7, 2020

nvn bmh

జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రమూక రెచ్చిపోయింది. భారత సైన్యంపై తెగబడిన దాడిలో ఓ యువ జవాను అమరుడయ్యాడు. మిలిటెంట్లు జరిపిన కాల్పుల్లో పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం నాగేపల్లి గ్రామానికి చెందిన సాలిగం శ్రీనివాస్ (28) వీర మరణం పొందాడు. సోమవారం సాయంత్రం ఈ విషయాన్ని అతని కుటుంబ సభ్యులకు ఆర్మీ అధికారులు తెలియజేశారు. దీంతో అతని కుటుంబంతో పాటు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. దేశంపై ఉన్న ప్రేమతో సేవ చేసేందుకు వెళ్లిన అతడు ఇంతలోనే ప్రాణాలు కోల్పోవడంతో ఆ కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది.  

శ్రీనివాస్ 2013 లో ఆర్మీలో చేరాడు. ట్రైనింగ్ పూర్తి చేసుకున్న తర్వాత జమ్మూ కశ్మీర్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. రెండేళ్ల క్రితమే శ్రీనివాస్ పెళ్లి కూడా చేసుకున్నాడు. అతని మరణంతో భార్య మమత ఒంటరైపోయింది. అతని తండ్రి పశువుల కాపరిగా పని చేసేవాడు. నిరుపేద కుటుంబం కావడంతో తన వంతు సాయంగా ఉంటూ వచ్చాడు. అతని తమ్ముడు సొంత గ్రామంలోనే తాపి మేస్త్రీగా పని చేస్తున్నాడు. కష్టాలు తీరుతున్నాయని అనుకునే సమయంలోనే మృత్యువు ఇలా తీసుకెళ్లడం అందరిని కలిచి వేసింది. ఈ సంఘటనతో తోటి జవానులు కూడా తీవ్ర దిగ్భ్రాంతిలో మునిగిపోయారు. కాగా చాలా రోజులుగా జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రమూక అలజడి సృష్టిస్తూనే ఉంది. దాడులకు తెగబడేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నా జవానులు వాటిని సమర్థవంతంగా తిప్పి కొడుతున్నారు. ఇటీవల ఆర్మీ పెట్రోలింగ్ వాహనంపై దాడికి ప్లాన్ వేసి భంగపడిన సంగతి తెలిసిందే.