ప్రేమ గుడ్డిది అంటారు. ఆస్తులు, అంతస్తులు, కులమతాలు, ప్రాంతాలు వంటి భేదాలు పట్టించుకోకుండా ఇష్టమైన వాళ్లను ప్రేమించి పెళ్లాడేస్తుంటారు. కొన్ని సుఖాంతాలవుతుంటాయి. కొన్ని విషాదాంతాలు. ఈ ప్రేమల్లో కొన్ని మరింత గొప్పగా ఉంటాయి. బామ్మలను ప్రేమించే కుర్రోళ్లు, తాతలను ప్రేమించే అమ్మాయిలు.. ఎన్నో కథలుంటాయి. ప్రేమకు వయసుతో తేడా లేదని చాలా మంది సెలబ్రిటీలు కూడా నిరూపిస్తుంటారు. ఈ తేడాలు పట్టని వ్యవహారం కేవలం మనుషులకే పరిమితం కాదు. జంతువుల్లోనూ వయోభేదాలకు అతీతమైన ప్రేమ వెల్లివిరుస్తుంటుంది. అందుకు తాజా ఉదాహరణ ఈ ఆఫ్రికా పెంగ్విన్ల జంట. వీటిలో ఆడదాని వయసు 43 ఏళ్లు, కుర్రాడి వయసు అందులో ఇంచుమించు నాలుగో వంతు, కేవలం 13 ఏళ్లు. అయినా ఏ సమస్యా లేకుండా ఎంచక్కా కాపురం చేస్తున్నారు. అది కూడా తమ గుంపులో కాకుండా బయట విడిగా వేరే కాపురం పెట్టుకున్నారు. అంటే, చాలా కథ ఉందన్నమాటేగా.
ముసలిదని అవమానాలు..
అమెరికాలోని వర్జీనియా రాష్ట్రంలోని మెట్రో రిచ్మండ్ జూలో ఉన్నాయి ఈ పక్షులు. లేడీ పేరు ఈటీ, జెంట్ పేరు ఐన్‌స్టీన్. ఇవి ఆఫ్రికన్ జాతి పెంగ్విన్లు. 20 ఏళ్లకు మించి బతకవు. కానీ ఈటీ గట్టిపిండం. అందుకే అత్యంత ముసలిదానిగా రికార్డులకెక్కింది. దీనికి రెండు పెళ్లిళ్లు జరిగాయి. ఇద్దరు భర్తలూ ఎప్పుడో చచ్చిపోయారు. 35 ఏళ్లు బతికిన ఓ కూతురు కూడా చనిపోయింది. వయసు మీద పడ్డంతో తోటి పెంగ్విన్లు దీన్ని కుళ్లబొడవడం మొదలుపెట్టాయి. ‘అసుంటా పోవే ముసలిదానా’ అని చీదరించుకున్నాయి. సరిగ్గా అదే సమయంలో పదేళ్ల కిందట ఐన్‌స్టీన్ పరిచయయ్యాడు. మునిమనవడి వయసులో ఉన్న ఇన్‌స్టీన్ బామ్మకు తెగ నచ్చాడు. కుర్రాడికి కూడా బామ్మ నచ్చింది. ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరగడం మొదలుపెట్టారు. దీంతో తోటి పక్షులు మరింత వేధించాయి. జూ సిబ్బంది రంగంలోకి దిగి ఈ వింతజంటకు ప్రత్యేక ఎన్‌క్లోజర్ తయారుచేసి అందులో వదిలేశారు. ఇప్పుడవి చాలా సుఖంగా గడుపుతున్నాయి. ఒకరంటే ఒకరికి పిచ్చిప్రేమ అని సిబ్బంది చెబుతున్నారు. పెంగ్విన్ జంటల్లో ఇంతటి వయోభేదం ఉండదని, మేరేజెస్ ఆర్ మేడిన్ హెవెన్ అని అంటున్నారు. ఇంతకూ బామ్మకు ఈటీ అని పేరెందుకు పెట్టారో తెలుసా? అది ఈటీ(ఎక్ట్రా టెలిరెస్ట్రియల్) సినిమా విడుదలై 1980లో పుట్టింది కాబట్టి!!